సుకుమార్ తో రత్నవేలు లేడు….

సుకుమార్ తో రత్నవేలు లేడు....

సుకుమార్ ఆస్థాన టెక్నీషియన్లలో రత్నవేలు ఒకడు. సుక్కు తొలి సినిమా ‘ఆర్య’తో మొదలైంది వీళ్ల ప్రయాణం. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలకు మాత్రమే అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కెమెరామన్‌ను మార్చాడు సుక్కు. తనకు ఎంతో సౌకర్యంగా ఉండే రత్నవేలుకు కెమెరా పని అప్పగించేస్తే ప్రశాంతంగా మిగతా పనులు తాను చూసుకోవచ్చని భావిస్తాడు సుక్కు.

వీళ్లిద్దరికి ఎంత బాగా బాగా సింక్ అవుతుందో వాళ్ల సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది. ఐతే సుక్కు తీయబోతున్న ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి రత్నవేలు పని చేయలేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ‘భారతీయుడు-2’ కమిటై ఉండటంతో బన్నీతో సుక్కు తీయబోయే సినిమాకు డేట్లు కేటాయించలేకపోయాడు రత్నవేలు. అనుకున్న సమయానికి ఈ సినిమా మొదలు కాకపోవడంతో రత్నవేలు తప్పుకోక తప్పలేదు.

సుక్కు కొత్త సినిమాలో తాను పని చేయట్లేదనే విషయాన్ని రత్నవేలు స్వయంగా ప్రకటించాడు. మరి రత్నవేలు స్థానంలో ఎవరొస్తారా అని ఆసక్తి చూసిన వాళ్లకు సమధానం దొరికింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మిరస్లోవ్ కూబా.. సుక్కు-బన్నీ సినిమాకు ఛాయాగ్రహణం అందించనున్నాడు. అతను పోలెండ్ దేశానికి చెందినవాడు. అక్కడ కెమెరామన్లు కుప్పలు కుప్పలుగా తయారవుతారు. ప్రపంచంలోనే అత్యధికంగా కెమెరామెన్స్ వచ్చేది ఇక్కడి నుంచేనట. వీళ్లు తక్కువ పారితోషకాలకే పని చేస్తారట.

‘గ్యాంగ్ లీడర్’లో తనదైన పనితనం చూపించిన కూబా సుక్కు-బన్నీ సినిమాకు కోటి 25 లక్షలు మాత్రమే పారితోషకం తీసుకుంటున్నాడట. రత్నవేలుకైతే రూ.3 కోట్లకు పైగానే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్‌తో మైత్రీ సంస్థతో బాగా ఖర్చు పెట్టించిన సుక్కు తక్కువ డబ్బులకే మంచి పనితనం అందిస్తాడనే నమ్మకంతో కూబాతో సర్దుకుపోతున్నాడట.