2019 ఎన్నికల సమరశంఖం పూరించడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా జిల్లాల సమన్వయ కమిటీ సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఏరియా కో ఆర్డినేటర్స్ నియామకంతో పాటు బూత్ కమిటీలు పెండింగ్ లో వున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గుంటూరు జిల్లాకి సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయంలో ఇందుకోసం కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు తో పాటు సిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లు పాల్గొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు.
మంత్రి పదవి పోయాక అధిష్టానం కి కంటిలో నలుసుగా వ్యవహరించారు ఆయన. మంద కృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా గళం ఎత్తడానికి కూడా రావెల అండదండలు ఉన్నాయని అప్పట్లో అంతా అనుకున్నదే. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు ఆయన. ఓ దశలో ఆయన వైసీపీ ముఖ్యులతో కూడా రహస్య చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ ఎందుకో ఆ పార్టీలోకి వెళ్లలేకపోయారు. BSP రాష్ట్ర శాఖ బాధ్యతలు తీసుకుంటారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అందులో నిజం వున్నా, లేకున్నా తాజా జాతీయ రాజకీయాల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత్రి మాయావతి కూడా చంద్రబాబు మాట కాదనలేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకున్నారేమో గానీ రావెల పార్టీ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే ఎక్కడా తలపులు తెరుచుకోక పార్టీలో కొనసాగుతున్న రావెల విషయంలో టీడీపీ హైకమాండ్ ఇంతకుముందులా పెద్ద పీట వేయడం కష్టమే.