Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. హైకోర్టును విభజించాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ కూడా పార్లమెంట్ లో పట్టుబట్టారు. జితేందర్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు జడ్జిల నియామకాల్లో తెలంగాణకు అన్యాయం జరగుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం రవిశంకర్ ప్రసాద్ ఈ అంశంపై ప్రకటన చేశారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని వెల్లడించారు. ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర రాజధానిలో కొత్తగా ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటుచేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని… ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని, అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధానన్యాయమూర్తిని కోరానని వివరించారు.
హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ, శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందన్నారు. అంతవరకూ పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తిచేశారు. న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకాలన్నీ కొలీజియమే చేస్తుందని స్పష్టంచేశారు. అటు టీఆర్ ఎస్ ఎంపీల వాదనపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభ్యంతరం వ్యక్తంచేశారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదని, విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ఇరురాష్ట్రాలతో సమావేశమవుతామని, అన్ని అంశాలపై చర్చిస్తామని హామీఇచ్చారు.