Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రవితేజ గత చిత్రం ‘టచ్ చేసి చూడు’ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. ఆ చిత్రం డిజాస్టర్ అయినా కూడా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న ‘నేలటికెట్’కు విపరీతమైన క్రేజ్ ఉంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఈ క్రేజ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రాల తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో పాటు, రవితేజ గత లుక్‌లో కనిపిస్తుండటం వల్ల కూడా సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
రవితేజలోని పూర్తి మాస్ యాంగిల్‌ను ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ చిత్రంను ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ డబ్బింగ్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ కలిపి ఏకంగా 25 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో అమ్ముడు పోవడం కొత్తేం కాదు. కాని రవితేజ సినిమా ఈ స్థాయిలో అమ్ముడు పోవడంతో అంతా కూడా షాక్ అవుతున్నారు. రవితేజ సినిమాపై ఎందుకు ఆ ఛానెల్‌కు ఇంత నమ్మకం అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరియు రవితేజ లుక్‌ను దృష్టిలో పెట్టుకుని వారు ఇంత భారీ మొత్తంను నిర్మాతలకు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇదే వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.