ఒక హిట్టు-రెండు ప్లాపులు అంటూ కెరీర్ లాగిస్తున్న రవితేజ, నో హిట్టు-నాలుగు ప్లాపులు అంటూ ఊసురుమంటున్న శ్రీను వైట్ల కలిసి ఎలాగైనా హిట్టు కొట్టితీరాలని చేసిన ప్రయత్నం – అమర్ అక్బర్ ఆంథోనీ. ఈ సినిమాలో రవితేజ అమర్, అక్బర్, ఆంథోనీ అంటూ మూడు పాత్రల్లో నటిస్తుండగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఒక్కతే హీరోయిన్ ఉంది కనుక ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం కాదు, ఒక్కడే మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు అని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఊహించుకుంటున్నారు. థమన్ స్వరపరిచిన పాటల్లో కొన్ని విడుదలయ్యి మంచిగానే శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే రవితేజ-శ్రీను వైట్ల కలిసి నీకోసం, వెంకీ, దుబాయ్ శీను అంటూ మాంచి ఎంటర్టైనర్లనే ఇచ్చారు కనుక ఈ అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా పైన సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, రవితేజ అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ముచ్చట్లు పంచుకున్నారు. ఈ సినిమాలో అమర్ పాత్ర తనకి ఎంతగానో నచ్చిందని, ఈ అమర్ పాత్ర ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతుందని, దర్శకుడు శ్రీను వైట్ల వినిపించిన కథ తనకి ఎంతగానో నచ్చిందని, అంతే చక్కగా సినిమాని తెరకెక్కించాడని, మూడు పాత్రల మధ్య వైరుధ్యాన్ని భలేగా చూపాడని చెప్పారు. శ్రీను వైట్ల ఇప్పుడు ప్లాపుల్లో ఉన్నా, ఈ సినిమాని ఎంతో ఇష్టంగా తెరకెక్కించాడని, తాను కూడా ప్లాపులతో సతమతమైన సందర్భాలని గుర్తుచేశారు. థమన్ గురించి చెప్తూ, అప్పుడే 100 సినిమాలు ఎలా పూర్తిచేశాడా అని ఆశ్చర్యంగా ఉందని, ఈ సినిమాలో థమన్ అందించిన సంగీతం తప్పకుండ ప్లస్ అవుతుందని రవితేజ అభిప్రాయపడ్డారు.
నెగటివ్ రోల్స్ గురించి చెప్తూ, ఇప్పుడైతే తనకి అటువంటి క్యారెక్టర్ లు రావడం లేదని, కానీ తప్పకుండా నెగటివ్ రోల్స్ చేసే రోజు ముందుందని తెలిపారు. అంతేకాకుండా, తన సినిమాలకి బెస్ట్ క్రిటిక్ తన కొడుకు మహాధన్ అని, తన సినిమాలని విమర్శించడంలో తనని మించినోళ్లు లేరని చెప్తూ నవ్వులు పూయించారు. తమిళ సినిమా తెరి రీమేక్ సినిమా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని, ప్రస్తుతం వి. ఐ. ఆనంద్ దర్శకత్వంలో మాత్రమే ఇంకో సినిమా చేస్తున్నానని రవితేజ చెప్పారు. ఈ సినిమా నవంబర్ 16 న విడుదలవుతుంది.