Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో నెట్టుకురాగలిగారంటే చిన్న విషయం కాదు. పైగా రాజకీయ చైతన్యం దండిగా వున్న గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన ఎక్కువ సార్లు గెలుపొందారు. విభజనతో కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆయన టీడీపీ లో చేరి అనూహ్యంగా నరసరావుపేట టికెట్ తెచ్చుకుని ఎంపీ గా గెలిచారు. ఇప్పుడు టీడీపీ లో కూడా ఆయన కీలక నేతగా మారారు. ఈ రాజకీయ ప్రస్థానంలో రాయపాటి దండయాత్ర చాలా కీలకం అని ఆయన దగ్గర వున్నవారందరికీ పరిచయమే. ఆ దండ యాత్ర లో యాలకులు, కర్పూరం రాయపాటికి ఆయుధాలు. ఆయన వేసే యాలకుల దండలు, కర్పూర దండలు చాలా స్పెషల్. వాటికే చాలా మంది అగ్రశ్రేణి నాయకులు పడిపోతుంటారు. ఆ దండల తయారీ, మన్నిక గురించి రాష్ట్రపతి సైతం ఆయన్ని అడిగిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు తండ్రి స్థానంలో రాజకీయాలు చేయడానికి తర్ఫీదు అవుతున్నారు. ప్రజాసమస్యలపై ప్రతి సందర్భంలో ప్రభుత్వం తో మాట్లాడే అవకాశాన్ని వదులుకోడానికి రంగా సిద్ధంగా లేరు. మంత్రులు, సీఎం ఇలా ఎవరి దగ్గరికి వెళ్లాలన్నా తండ్రి కన్నా ముందే వుంటున్నారు రంగారావు. ఈయన కూడా తండ్రి సక్సెస్ లో భాగమైన దండయాత్ర ఫార్ములాని బాగానే అడాప్ట్ చేసాడు. ముఖ్యంగా మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు విషయంలో రంగారావు దండయాత్ర బాగానే పని చేస్తోందట. ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన ఓ అభివృద్ధి కార్యక్రమ సభలో దాదాపు ఐదు అడుగుల పొడవైన యాలకుల దండ వేశారు. ఆ దండ చూసి నవ్విన బాబు రంగారావు భుజం తట్టారు. మొత్తానికి ఇది చూసిన జనం బాబు మీద రాయపాటి కొడుకు కూడా దండయాత్ర చేసాడని చెప్పుకోవడం వినిపించింది.