కర్నూలు జిల్లాలో గత రాత్రి ఆలేరు మండలంలోని హత్తిబెళగల్ లోని ఒక మైనింగ్ క్వారీలో పేలుడు సంభవించి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మృతుల సంఖ్య 12కు చేరింది. ఇంకా కొంతమంది ఆసుపత్రిలో విషమ పరిస్థితులలో చికిత్స పొందుతుండగా ఇంకొంత మంది శిధిలాల కింద ఉండే అవకాసం ఉందని తెలుస్తోంది. అయితే అసలు క్వారీలో ఇంత పెద్ద పేలుడు ఎందుకు సంభవించింది అనే అంశాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం దీనికి అసలు కారణం గ్యాస్ సిలిండర్ నుండి లీకయిన గ్యాస్ వల్ల వచ్చిన మంట అని తేలింది. సాధారణంగా క్వారీలోని కొండల్ని పిండి చేసేందుకు జిలెటిన్ స్టిక్స్ ఒకదానికి ఒకటి పేర్చి డిటొనేటర్లుగా తయారు చేస్తారు. అవి కూడా ఒకదాని తరువాత ఒకటి అమర్చి తమ దగ్గర ఉండే లివర్ ద్వారా పేలుస్తారు కాబట్టి ముందుగానే అప్రమత్తం అయ్యి పేలుడు జరిగే ప్రాంతానికి దూరంగా వెళితే ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ ఉండేది కాదు. డిటొనేటర్లు ఎప్పుడూ క్వారీలో నిలువ ఉంచరు కానీ ఈ క్వారీలో డిటొనేటర్లని భారీగా స్టాక్ పెట్టారు. మూడు వందలకు పైగా ఎలక్ట్రికల్ డిటొనేటర్లు, కిలోల కొద్దీ గన్ పౌడర్, విడి జిలెటిన్ స్టిక్స్ అక్కడ స్టాక్ పెట్టారు. ఎందుకంటే ఇటీవలే ఒకసారి అక్కడ బ్లాస్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అవి పేలలేదు దీంతో అవి పనికిరానివిగా భావించి అక్కడే వదిలేశారు. అయితే దురదృష్టవశాత్తూ ఒడిశా రాష్ట్రానికి సంబందించిన కూలీలు అక్కడే పనిచేస్తూ గుడిసెలు వేసుకుని ఉంటూ నిన్న రాత్రి వంట నిమిత్తం గ్యాస్ స్టవ్ వెలిగిస్తే గ్యాస్ లీక్ వల్ల మంటలు సంభవించి అవి అక్కడే వదిలేసిన డిటొనేటర్లు, గన్ పౌడర్ తదితరాలకి అంటుకుని మంటలు చెలరేగాయి. అవన్నీ భారిగా అక్కడ స్టాక్ చేయడంతో ఇంత ఘోరం జరిగింది.