సెమీస్ లో భారత్ ఓటమికి కారణాలు ఇవే !
ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ కొట్టి ధోనీకి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావించినా సెమీఫైనల్లో ఓడిన భారత్.. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. 240 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోహ్లిసేన 221 పరుగులకే పరిమితమైంది. నాకౌట్ మ్యాచ్‌ల్లో చేధించాల్సిన లక్ష్యం ఎంత చిన్నది అయిన ఎంతటి ఒత్తిడికి గురి చేస్తుందో తాజా మ్యాచ్ ద్వారా మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కారణాలేంటో చూద్దాం.. టాస్ : నాకౌట్ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టాస్ గెలవగానే విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన కేన్.. కివీస్ 239 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లి టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే వాడే. వర్షం: మాంచెస్టర్‌లో వర్షం పడటం కూడా టీమిండియా ఓటమికి ఓ కారణమే. వర్షం పడకుండా మ్యాచ్ మంగళవారమే ముగిసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ బ్యాడ్ లక్ వర్షం కారణంగా మ్యాచ్ బుధవారానికి వాయిదా పడింది. ఉదయాన్నే పిచ్ మీద, వర్షం కారణంగా పేస్‌కు అనుకూలించే పరిస్థితుల వలన కివీస్ బౌలర్లు చెలరేగిపోయారు. కుప్పకూలిన టాప్ ఆర్డర్: భారత టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టాప్-3 బ్యాట్స్‌మెన్ ఒక్కో పరుగు చొప్పున చేసి అవుటవాదంతో అక్కడే భారత్ సగం ఓడింది. కివీస్ బౌలర్ల అద్భుత బంతులకు రోహిత్, కోహ్లి దగ్గర సమాధానం లేకపోయింది. ధోనీ ఏడో స్థానంలో దిగడం: ఈ మ్యాచ్‌లో ధోనీ ఏడోస్థానంలో బ్యాటింగ్ రావడం కూడా ఓటమికి ఓ రకంగా కారణం కావొచ్చు. దినేశ్ కార్తీక్ స్థానంలో ధోనీని ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తే ఫలితం మరోలా ఉండేదేమోనని మాజీ క్రికెటర్లు గంగూలీ, లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ధోనీ రనౌట్: భారత్ మ్యాచ్ పూర్తిగా చేజారింది ఇక్కడే. 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ధోనీ-జడ్డూ భారత్‌ను శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. కీలక సమయంలో జడేజా అవుటవగా ధోనీ కూడా అనూహ్యంగా రనౌటయ్యాడు. ఈ రనౌటే మ్యాచ్‌ను కివీస్ వశం చేసింది. క్రీజుకు అంగుళాల దూరంలో ధోనీ బ్యాట్ ఆగిపోవడమే.. భారత్ వరల్డ్ కప్ అవకాశాలు కూడా ఆగిపోయాయి.
|
|
|