తన మీద కక్ష కట్టి తెరాస ప్రభుత్వమే దర్యాప్తు సంస్థలను తన మీదకు ఉసిగిలిపారని వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి టీఆరెస్ మీదా కేసీఆర్ మీదా ఆయన కుటుంబం మీదా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు తెలంగాణకు పట్టిన నాలుగు కొరివి దెయ్యాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదుగానీ, ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు రావాలంటే ఆయన ఒక్క ఉద్యోగం పోవాల్సిందేనని అన్నారు.
ఆయన ఇంట్లోని ఐదుగురూ కలిపి నెలకు రూ. 30 లక్షల జీతాన్ని తీసుకుంటున్నారని ఆరోపించిన రేవంత్, టీఆర్ఎస్ ను సాగనంపే రోజు వచ్చిందని అన్నారు. అలాగే జిల్లాకి చెందిన కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది సన్నాసులు పోతే కాంగ్రెస్ కు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి ఎక్కడని రేవంత్ ప్రశ్నించారు. బోధన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరచుకోకపోవడానికి కేసీఆరే కారణమని ఇక్కడ పోటీలో కాంగ్రెస్ తరఫున నిలిచే షబ్బీర్ అలీని గెలిపిస్తే, ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన తొలి రెండు స్థానాల్లో ఉంటారని, నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.