Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ తెర మీదకి వచ్చిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఈ కేసు తెర మీదకి రావడం ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ గూటిలో ఉన్న మాజీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్న ఈ కేసును ఇప్పుడు సీఎం కేసీఆర్ తవ్వితీయడం కలకలం రేకెత్తిస్తోంది. అయితే ఈ పరిణామాలపై తాజాగా రేవంత్ రెడ్డి స్పందించారు. మోడీ మీద బాబు తెలంగాణా కేడీ మీద తాను పోరాడుతున్నందుకే కేసుల తిరగదోడుతా అంటున్నారని ఆరోపించారు.
‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డైరెక్షన్లోనే తెలంగాణ సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మోడీ… కేడీ కలిసి ఆడుతున్న నాటకమే నిన్నటి రివ్యూ’ అని రేవంత్ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆయన నిప్పులు చెరిగారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడం… మోడీకి ఇబ్బందికరంగా మారిందని, అందుకే ఓటుకు నోటు కేసును మళ్లీ ప్రస్తావిస్తున్నారని రేవంత్ అన్నారు. చంద్రబాబు తిరుపతి సభ తరవాత మోడీ, అమిత్‌లు ఆదేశాలు ఇచ్చారన్నారు. తాను ఓటుకు నోటు కేసులో బెయిల్‌పై బయటకు వచ్చినందున ఆ కేసు గురించి లోతుగా ప్రస్తావించడంలేదని రేవంత్ చెప్పారు.
తెలంగాణలో బస్సు యాత్రలో ప్రభుత్వంపై విమర్శలు చేసినందున తనపై కక్షసాధింపునకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ అన్నారు. పలు సీబీఐ కేసుల్లో కేసీఆర్ ఇరుక్కున్నారని, అందుకే మోడీ చెప్పినట్లు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని రేవంత్ ఆరోపించారు. కేంద్రంలో తొలుత సీబీఐ, ఈడీలను పంపి తరవాత మోడీ, అమిత్ షాలు రంగంలోకి దిగుతారని, అలాగే రాష్ట్రంలో తొలుత ఏసీబీని ఉసిగొలిపి తరవాత కేసీఆర్ రంగంలోకి దిగుతారని ఆయన ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్ అన్నారు.
`2016 సంవత్సరం లో ఏసీబీ కేసులో దొరికిన వాళ్లలో 125 మంది పై కేసులు ఎత్తివేశారు. ఏసీబీ కేసులు ఎత్తివేయడంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దవినీతి పరులను కాపాడడంలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు. నిమ్స్ మాజీ డైరెక్టర్ శేషగిరిరావు లంచం తీసుకుంటూ పట్టుబడితే కేసు కొట్టివేశారు. కేసీఆర్ బంధువు కాబట్టే శేషగిరిరావును కేసు నుంచి బయట పడేశారు. కేసీఆర్ బంధువులు అయితే చాలు కేసుల నుంచి బయటపడొచ్చు. సంజీవ్ రావు అనే ఏసీపీ పై కేసును కూడా ఉపసంహరించారు. సంజీవ్ రావు కూడా కేసీఆర్ బంధువు` అని ఆరోపించారు. మీ బంధువులు అయితే, మీకు సంపాదనలో వాటా ఇచ్చేవాళ్లైతే ఏ తప్పు చేసినా పట్టించుకోరా? అని ప్రశ్నించారు.
‘వాయిస్ ను ఆధారంగా చేసుకుని చంద్రబాబును దోషి అని అంటున్న కేసీఆర్… ఇదే తరహాలో వేమలు వీరేశం మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారాలు ఇచ్చినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గొంతు అవునాకాదా అని ఫోరెన్సిక్కి పంపిన కేసీఆర్… వీరేశం గొంతును ఎందుకు పంపించలేదని నిలదీశారు. లంచాలు తీసుకోండని బహిరంగంగా చెప్పిన సిరిసిల్ మునిసిపల్ చైర్మన్‌పై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర అందరికీ తెలుసుని, ఆయన ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని రేవంత్ చెప్పారు. నువ్వు తప్పించుకుంటానని అనుకుంటున్నావేమో? కానీ నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకోలేవు ఖబర్దార్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.