Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీని వీడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడికి రాసిన లేఖ తెలంగాణలో కలకలం సృష్టిస్తోంది. రేవంత్ అసలు రాజకీయ లక్ష్యాల సంగతి పక్కనపెడితే… లేఖ లో రేవంత్ తాను టీడీపీని వీడాల్సిరావడానికి చెప్పిన కారణాలు సహేతుకమైనవే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ఎందరో బలిదానాలు చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు… ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నో త్యాగాలకోర్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు. కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం అనుభవించారు. ప్రత్యేకరాష్ట్రం కల నెరవేర్చుకోడానికి అనేక కష్టనష్టాల కోర్చారు. అందరి ప్రయత్నాలు ఫలించి… ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటయింది. కానీ తరువాత ఏం జరిగింది..? ఉద్యమం కోసం ప్రాణార్పన చేసిన అమరులు, పోరాట వీరులు, ఉద్యమకారులకు రాష్ట్రంలో ప్రాధాన్యం లేకుండా పోయింది. మొత్తం రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో ఉన్నట్టు మారిపోయింది.
తెలంగాణ ప్రజలందరూ కలిసి పోరాటాలు చేస్తే ప్రత్యేకరాష్ట్రం వచ్చింది… కానీ కేసీఆర్ కుటుంబం చేసిన ఉద్యమాల వల్ల కాదు. అయితే ప్రత్యేక రాష్ట్ర ఫలాలన్నీ కేసీఆర్ కుటుంబం, ఆయన సన్నిహితులే అనుభవిస్తున్నారన్న భావన తెలంగాణ ప్రజల్లో నెలకొంది. నిజానికి వారసత్వ రాజకీయాలు మనదేశానికి కొత్త కాదు. జాతీయస్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ రాజకీయం వారసత్వంగా దశాబ్దాల క్రితమే మారిపోయింది. అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు, తెలంగాణకు పోలిక లేదు. అది పోరాట వీరుల గడ్డ. చైతన్యానికి ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం స్వతంత్ర భారత చరిత్రలో ప్రత్యేక ఘట్టం. సామాన్యులు రక్తం చిందించి ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం. కాబట్టి అక్కడ సామాన్యునికే పెద్ద పీట ఉండాలి. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమవీరులకు పాలనలో ప్రాధాన్యం దక్కాలి. ప్రజాస్వామ్య భావనకు ఆ రాష్ట్రం ప్రతీకగా నిలవాలి. కానీ… తెలంగాణ పయనం దీనికి పూర్తి విరుద్ధంగా సాగుతోంది. నియంతృత్వ పాలనను తలపిస్తోంది.
మేధావులు మాట్లాడరు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం లేదు. అసలు ప్రతిపక్షమన్నది ఉనికిలో ఉన్నట్టే కనిపించదు. అధికారపక్షమూ, ప్రతిపక్షమూ రెండూ టీఆర్ఎస్సే అన్నట్టు ఉంది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు. రాష్ట్రం రాజకీయం మొత్తం వారిచూట్టూనే తిరుగుతుంటుంది. కేటీఆర్ ను భావి ముఖ్యమంత్రిగా తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు కేసీఆర్. ఆయన ఆడింది ఆట. పాడింది పాట. ఎవరన్నా విమర్శలకు దిగితే తన వాగ్ధాటితో తిప్పికొడతారు. లేదంటే భయపెట్టి లొంగదీసుకుంటారు. మొత్తంగా చెప్పాలంటే తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయిన కొత్తల్లో టీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా, బలమైన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ… మూడేళ్లు తిరిగే సరికల్లా ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడడమే ఇందుకు నిదర్శనం. విస్తృతమైన క్యాడర్ ఉన్న పార్టీ అంతలా క్షీణించడానికి కారణం కేసీఆర్ అన్నది అందరికీ తెలిసిన నిజం. పరిస్థితిని గ్రహించి చంద్రబాబు మౌనంగా పక్కకు తప్పుకున్నారు గానీ… రేవంత్ రెడ్డి ఆ పనిచేయడం లేదు.
ప్రస్తుతం కేసీఆర్ ను ఎదురొడ్డి నిలిచే బలమైన నాయకుడు తమకు కావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోంది. ఇది గ్రహించారు రేవంత్ రెడ్డి. ఆ నాయకుడిని తాను కావాలన్నది రేవంత్ లక్ష్యం. కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయటానికి ఆయనకు సరైన వేదిక కావాలి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడీపీ అలాంటి వేదిక కాలేదు. అందుకే ఇంకోదారి చూసుకున్నారు. తన లేఖలో రేవంత్ ఈ ఆకాంక్షనే వ్యక్తంచేశారు. తెలంగాణ సమాజం కోరుకుంటున్నట్టుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ చేయడానికే తాను పార్టీని వీడుతున్నానని, తన నిర్ణయాన్ని ఆ కోణంలోనే చూసి సహృదయంతో అర్ధం చేసుకోవాలని చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు రేవంత్. కాంగ్రెస్ లో చేరి తెలంగాణ కోరుకుంటున్నట్టుగా రేవంత్ బలమైన నాయకుడిగా, కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతారా లేక… మిగిలిన హస్తం నేతల్లానే మిగిలిపోతారా అన్నది కాలమే తేల్చాలి.