ఎవరేం అన్నా భయపడను.. నేను అనుకున్నది తీస్తా

rgv-says-i-wont-fear-for-any-body-i-will-take-lakshmis-ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వివాదాల వర్మ రామ్‌గోపాల్‌ వర్మ మొదలు పెట్టిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు వైకాపా నాయకుల మద్దతు ఉండటంతో పాటు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వ్యతిరేంగా ఉంటుందని వర్మ చెప్పకనే చెప్పాడు. వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద ఎన్టీఆర్‌ ఆరోజు పడ్డ మానసిక వేదన, బాధను తాను ఈ చిత్రంలో చూపిస్తాను అంటూ వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. వర్మ స్క్రిప్ట్‌ పూర్తి చేసిన తర్వాత తెలుగు దేశం పార్టీ నాయకులకు లైన్‌ టు లైన్‌ చూపించి అప్పుడు సినిమా మొదలు పెట్టుకోవాలని ఇటీవలే టీడీపీ నాయకులు వర్మను హెచ్చరించారు.

ముంబయి మాఫియానే వర్మ ఎదురించి, బెదరకుండా తాను అనుకున్నది చేశాడు. ఏపీ రాజకీయ నాయకుల మాటలకు ఆయన భయపడతాడా చెప్పండి. అంతా అనుకున్నట్లుగానే తాను అనుకున్నది అనుకున్నట్లుగా, వారు బెదిరించినందుకు ఇంకాస్త ఘాటుగా సినిమాలో చూపించబోతున్నాడు. లక్ష్మీ పార్వతి పాత్రకు ఒక బాలీవుడ్‌ నటిని తీసుకునే అవకాశం ఉంది. మరో వైపు అందరికి సుపరిచితురాలు అయితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వర్మలో ఉంది. అందుకే లక్ష్మీ పార్వతి పాత్రకు ఎవరు ఎంపిక చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు. ఇక ఎన్టీఆర్‌ పాత్రకు ప్రకాష్‌ రాజ్‌ పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

మీడియాలో ఎన్టీఆర్‌ పాత్రకు ప్రకాష్‌ రాజ్‌ పేరును పరిశీలిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను వర్మ కొట్టి పారేశాడు. ఎన్టీఆర్‌ పాత్ర కోసం నటుడిని ఇంకా వెదికే పనిలో ఉన్నామని, త్వరలోనే ఒక మంచి నటుడిని పట్టుకుంటాం అని వర్మ చెప్పుకొచ్చాడు. ప్రకాష్‌ రాజ్‌ ఈ చిత్రంలో నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలోని ఒక పాత్రను రోజాతో చేయిస్తే బాగుంటుందని తన అభిప్రాయం అని, ఆమె ఎలా రియాక్ట్‌ అవుతుందో అని వర్మ ఇటీవలే చెప్పుకొచ్చాడు. అయితే ఆ పాత్ర ఏంటి అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆ పాత్ర ఏంటో తెలుసుకోకుండానే రోజా నిర్మొహమాటంగా సారీ చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.