Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు సంబంధం లేని విషయాల్లోనే వేలు పెట్టి గెలికేస్తూ ఉంటాడు. ఇక ఎవరైనా తనను ఇన్వాల్వ్ చేసి విమర్శలు చేస్తే ఊరుకుంటాడా చెప్పండి. ఆ మద్య తన గురించి తప్పుగా మాట్లాడినందుకు నాగబాబు గురించి ట్విట్టర్లో ఏ స్థాయిలో ట్వీట్స్ చేశాడో ఏ ఒక్కరు మర్చిపోలేరు. తన గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడితే వారు ఎంతటి వారు అయినా కూడా కౌంటర్ ఇవ్వకుండా వదిలి పెట్టడు. అలాంటి వర్మ నోట్లో నోరు పెట్టి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద తప్పు చేశారు.
వర్మ ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఖచ్చితంగా ఆ సినిమాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సీన్లు ఉండబోతున్నాయి అంటూ స్వయంగా వర్మ చేసిన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు అధికారం ఎలా లాక్కున్నాడు అనే విషయాన్ని చూపిస్తాడని అంతా భావిస్తున్నారు. దాంతో వర్మ తీయబోతున్న సినిమాపై తెలుగు దేశం నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. వర్మ సినిమా గురించి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. స్క్రిప్ట్ అంతా మాకు చూపించి ఆ తర్వాత సినిమా చేయాలని ఇటీవలే వర్మకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తాజాగా మరోసారి వర్మను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు.
మంత్రి మాట్లాడుతూ.. పనీపాట లేని వర్మ వివాదం కోసమే ఈ సినిమా తీస్తున్నాడని, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అందరికి తెల్సిందే. సినిమా తీసుకుని లక్ష్మీ పార్వతినే హీరోయిన్గా పెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేశాడు. అందుకు వర్మ సమాధానంగా లక్ష్మీ పార్వతిని హీరోయిన్గా తీసుకుని మిమ్ములను హీరోగా పెట్టి సినిమా తీస్తాను అంటూ వర్మ కౌంటర్ ఇచ్చాడు. అయితే లక్ష్మీ పార్వతితో మాత్రం నటించను, మరెవ్వరు అయినా పర్వాలేదు అంటూ మంత్రి సమాధానం ఇచ్చాడు. అందుకు వర్మ స్పందిస్తూ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకునే నుండి వ్యవసాయ కూలీ వరకు అందరిని అడిగి చూశాను, మీతో నటించేందుకు ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు అంటూ వర్మ మంత్రి గాలి తీశాడు. వారిని మీతో సినిమా చేయమని అడిగినప్పుడు చాలా నీచంగా మాట్లాడారు. మీ భార్యపై ఉన్న గౌరవంతో ఆవి ఏంటి అనేది నేను చెప్పను అన్నాడు.
ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు అంటున్న మైడియర్ సోమి ఇక్కడ ఎంత తెలుసు అనే ప్రశ్న కాదు, నీకు తెలిసేంత బుర్ర ఉందా అంటూ మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంత్రి చేసిన ప్రతి వ్యాఖ్యకు కూడా కౌంటర్‌గా వర్మ ఫేస్బుక్ ద్వారా కౌంటర్ ఇచ్చాడు వర్మ. అసలే వర్మ నోరు మంచిది కాదు. ఆయనతో పెట్టుకోవడం ఎందుకు అంటూ మంత్రిని కొందరు తప్పుబడుతున్నారు. వర్మ కౌంటర్‌కు మంత్రి ఇప్పుడు ఎలా స్పందిస్తాడో అని నెటిజన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోమిరెడ్డికి బుద్ది ఉంటే ఇంకా వర్మను గెలకడు అంటూ వర్మ అభిమానులు అంటున్నారు. నీకో దండంరా బాబు అని వర్మకు మంత్రి దూరంగా ఉంటాడని సినీ వర్గాల వారు కూడా గుసగుసలాడుకుంటున్నారు.