ట్వీట్ లతో పాక్ ప్రధాని మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన వర్మ…! 

RGV's Funny Jokes On Pakistan Prime Minister
వివాదాస్పద అంశాలనే మాట్లాడుతూ వివాదాలతోనే పాపులర్ అయిన రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు తొలి సారిగా జనాదరణ పొందుతున్నాయి. తాజాగా పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై మీద జరిగిన ఆత్మాహుతి దాడిని ఉటంకిస్తూ వరుస ట్వీట్లతో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఏకి పారేశాడు. ప్రియమైన ప్రధాని అంటూనే ట్వీట్లతో ఖాన్ ని తెల్లమొహం వేసేలా చేశాడు. ముందుగా సమస్యలు చర్చల ద్వారా పరిష్కారమైపోతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది కాదన్న వర్మ మా మొద్దు భారతీయులకు ఒక వ్యక్తి వందలకొద్దీ పేలుడు పదార్థాలతో భారత్‌ వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతడితో చర్చలు ఎలా జరపాలో నేర్పాలంటూ కౌంటర్ ఇచ్చాడు. అదేమీ ఊరికే చేయాల్సిన పనిలేదని, అందుకు భారతీయులందరం కలిసి ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తామని పేర్కొన్నాడు.
ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి పాక్‌లో ఉన్న సంగతి పాక్ కి తెలియకున్నా అమెరికాకు తెలుస్తుందన్న వర్మ అలా జరగడానికి అసలు మీది దేశమేనా? అని ప్రశ్నించాడు. ఓ మొద్దు భారతీయుడిగా తాను అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, తమకు కొంచెం తెలివితేటలు నేర్పాలని కోరాడు. జైషే మహ్మద్, లష్కరే తాయిబా, తాలిబన్, అల్‌ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లు అని తనకు ఎవరూ చెప్పలేదని ఆ సంస్థలపై మీకు ప్రేమ లేదన్న విషయాన్ని కూడా మీరెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నాడు. అంతేకాక ఆ  సంస్థలను బంతులుగా భావించి పాకిస్థాన్ బౌండరీలను దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి పంపుతున్నారని, వాటిని మీరు బంతులనుకుంటున్నారా? లేక, బాంబులనుకుంటున్నారో చెప్పాలంటూ వరుసపెట్టి ఇమ్రాన్‌ కి ట్వీట్ ల సర్జికల్ స్ట్రైక్ కి దిగాడు వర్మ. సహజంగా వర్మను ద్వేషించేవారు కూడా ఇప్పుడు దేశం విషయంలో వర్మ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.