నిజాం మ్యూజియంలో భారీ చోరీ ! 

robbery in nizam museum hyderabad
 హైదరాబాద్‌ పాతబస్తీ డబీర్‌పురా లోని నిజాం మ్యూజియంలో చోరీ కలకలంరేపింది. వెంటిలేటర్లు తొలగించి  మ్యూజియంలోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. రోజూ మాదిరిగానే సోమవారం మ్యూజియంను తెరిచిన సిబ్బందికి వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బంగారు టిఫిన్‌ బాక్స్‌, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు, సాసర్‌, స్పూన్‌ కనిపించలేదు. వస్తువులు కనిపించకుండా పోవడంతో షాకైన మ్యూజియం సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌ను పరిశీలించారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Nizam-Museum
మ్యూజియం మొదటి ఫ్లోర్‌లోని గ్రిల్స్‌ను తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. 15  అడుగుల ఎత్తుండే వెంటిలేటర్‌ గ్రిల్‌ తొలగించి లోనికి ఎలా ప్రవేశించారనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. మ్యూజియం, అలారం సిస్టం గురించి తెలిసిన వారే ఈ పని చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.  సాలార్‌జంగ్‌ మ్యూజియానికి వెనక సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పురానీ హవేలీలో నిజాం మ్యూజియం ఉంది. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చే సందర్శకుల్లో చాలామంది చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియంతోపాటు నిజాం మ్యూజియంనూ సందర్శిస్తారు.
Nizam-Museum