Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కువైట్ లో వైసీపీ స్థానిక విభాగం సభ్యులు ఏర్పాటుచేసిన నవరత్నాలు కార్యక్రమం వివాదంగా మారింది. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారన్న ఆరోపణల నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అరెస్టు చేశారని వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను రోజా ఖండించారు. తాను క్షేమంగా ఉన్నానంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను అరెస్టయ్యానన్న వార్త ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో తనకు తెలియదని, తానైతే హ్యాపీగా ఉన్నానని రోజా వీడియోలో తెలిపారు. నవరత్నాల మీటింగ్ విజయవంతంగా జరిగిందని తెలిపారు.
ప్రజలు సమూహంగా ఉండడం కువైట్ చట్టాలకు వ్యతిరేకం కావడంతో పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారని, అయితే అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైన తనను అరెస్టు చేయలేదని ఆమె స్పష్టంచేశారు. విషయాన్ని నిర్వాహకులు, పోలీసులు చూసుకుంటారని, తనకేమీ సంబంధం లేదని రోజా తెలిపారు. కువైట్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన నవరత్నాలు కార్యక్రమానికి దాదాపు 2వేలమంది వైసీపీ అభిమానులు హాజరయ్యారు.. సమావేశంలో కార్యకర్తలు పెద్దపెట్టున పార్టీకి అనుకూలంగా నినాదాలు చేయడంతో… నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే రోజాను కూడా అరెస్టు చేశారనే వార్తలొచ్చాయి.