వ్యక్తిగా నీచుడు… దర్శకుడిగా దేవుడు

Ajay Bhupathi Controversy comments on RGV

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మపై పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తు ఉంటారు. ఆయన శిష్యులు ఎక్కువగా ఆయన్ను గొప్ప వ్యక్తి అంటూ పొగుడుతూ ఉంటారు. అయితే ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వర్మ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి మంచి వ్యక్తిలో అయినా కూడా చెడును వెదికి పట్టుకుని, వారిని గెలుకునే వ్యక్తిత్వం వర్మది అని, ఆయనలో అది నాకు అస్సలు నచ్చదు. వ్యక్తిగతంగా అయితే ఆయనో నీచుడు అంటాను. ఆయన ఇతరుల ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా ప్రవర్తిస్తాడు అంటూ వర్మపై కాస్త సీరియస్‌గానే అజయ్‌ భూపతి కామెంట్స్‌ చేశాడు.

వ్యక్తిగా నీచుడు అయినప్పటికి దర్శకుడిగా దేశంలోనే అత్యుత్తమ టెక్నీషియన్‌. ఆయన తీసినట్లుగా ఈ దేశంలో ఎవరు సినిమాలు తీయలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వర్మ వ్యక్తిగా నీచుడు అయినా కూడా దర్శకుడిగా మాత్రం దేవుడు అని, ఎంతో మందికి ఆయన ఆదర్శనీయుడు, ఆయన దర్శకత్వ శైలితో ఒక కోర్సునే తయారు చేయవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడైనా బయోపిక్‌ తీయాల్సి వస్తే ఖచ్చితంగా వర్మ బయోపిక్‌ను తీస్తాను అంటూ అజయ్‌ భూపతి చెప్పుకొచ్చాడు. తనను నీచుడు అన్నా కూడా వర్మ పట్టించుకునే రకం కాదు. తన శిష్యుడు తన గురించి చెడ్డగా చెప్పాడనో, మంచి చెప్పాడనో వర్మ ఆలోచించే రకం కాదు అనే విషయం ప్రత్యేకంగా తెల్సిందే. అందుకే ఈ కామెంట్స్‌ను వర్మ లైట్‌ తీసుకుని నవ్వి వదిలేస్తాడు. ఇక ఇదే వర్మ ఆర్‌ఎక్స్‌ 100 చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయించేందుకు, అజయ్‌కి హిందీలో అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.