Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశీయ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వాల్ మార్ట్ గూటికి చేరిన నేపథ్యంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఫేస్ బుక్ లో భావోద్వేగపు పోస్ట్ పెట్టారు. పదేళ్లు గడిచాయి… ఇంతటితో ఫ్లిప్ కార్ట్ లో నా పని పూర్తయింది. మీరు మరిన్ని ఉత్తమసేవలు అందిస్తూ ముందుకు సాగాలి… అంటూ వీడ్కోలు పలికారు. ప్రపంచ ఇ-కామర్స్ రంగంలోనే అతిపెద్ద ఒప్పందం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటాను వాల్ మార్ట్ స్వాధీనం చేసుకోనుంది. రూ. 1.5లక్షల కోట్ల విలువైన ఈ ఒప్పందంతో ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ తో పాటు ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ కార్ప్ గ్రూప్ కూడా వైదొలుగుతుంది. డీల్ కుదరగానే సంస్థ నుంచి తప్పుకున్న సచిన్ బన్సల్ ఫ్లిప్ కార్ట్ తో తన అనుబంధాన్ని వివరిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.
ఫ్లిప్ కార్ట్ నిజంగా ఎంతో సాహసవంతమైన సంస్థని, వినియోగదారుల సౌలభ్యమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇక్కడ ఎంతో మంచి వ్యక్తులతో పనిచేసే అవకాశం తనకు దక్కిందని చెప్పారు. చాలా పెద్ద సవాళ్లను స్వీకరించామని, దేశీయ మార్కెట్ రంగంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించామని, అలా పదేళ్లు గడిచాయని తెలిపారు. బాధకరమైన విషయమేమిటంటే… ఇంతటితో ఫ్లిప్ కార్ట్ లో తన పని పూర్తయిందని, ఇక తన పనులన్నీ అప్పగించి ఫ్లిప్ కార్ట్ వదిలి వెళ్లే సమయం వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాను ఎక్కడున్నా… ఫ్లిప్ కార్ట్ కు మద్దతిస్తూనే ఉంటానని. ఫ్లిప్ కార్ట్… మరిన్ని సేవలు అందిస్తూ ముందుకు సాగాలి అని కోరుకున్నారు. ఇక తాను తన వ్యక్తిగత ప్రాజెక్టులపై దృష్టిపెట్టేందుకు సమయం దొరికిందని, ఈ రోజుల్లో చిన్న పిల్లలు ఆడుకునే ఆటలపై దృష్టిపెడతానని, తన కోడింగ్ నైపుణ్యాలకు పనిపెడతానని చెప్పారు. ఫ్లిప్ కార్ట్ తో తన బంధం, అనుభవం అపూర్వమైనదని, ఆల్ ది బెస్ట్ ఫ్లిప్ కార్ట్ అని సచిన్ బన్సల్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.