దేశ వ్యాప్తంగా మీటూ అంటూ ఎంతో మంది లైంగిక వేదింపుల గురించి మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. పలువురు హీరోయిన్స్ మీటూ అంటూ దర్శకులు, నటులపై సంచలన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎంతో మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలో సంజన కూడా తన మొదటి సినిమా సమయంలో అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను అని, తన మొదటి చిత్ర దర్శకుడు రవి శ్రీవాస్తవ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆరోపించిన విషయం తెల్సిందే. దాంతో రవి శ్రీవాస్తవ ఆమె వాదనను కొట్టి పారేశాడు. ఆమె విమర్శలపై దర్శకుల సంఘంను ఆశ్రయించాడు. తన పరువు తీసిన ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరడం జరిగింది.
విచారణ జరిపిన దర్శకుల సంఘం వారు రవి శ్రీవాస్తవ ఎలాంటి తప్పు చేయలేదని నిర్థారణకు వచ్చారు. సంజన పబ్లిసిటీ కోసం ఈ ప్రచారం చేసిందని, ఆమె చేసిన ఆరోపణల వల్ల శ్రీవాస్తవ రవి పరువు పోయిందని దర్శకుల సంఘం మండి పడినది. సంజన వెంటనే దర్శకుడు రవికి క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సంజన క్షమాపణలు చెప్పే వరకు ఆమెకు కన్నడ సినిమా పరిశ్రమలో ఛాన్స్‌లు ఇవ్వొద్దంటూ దర్శకులకు అల్టిమేటం జారి చేయడం జరిగింది. దర్శకుల ఒత్తిడికి దిగొచ్చిన సంజన ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొంది. మీటూ అంటూ ఆరోపణలు చేయడం ఎందుకు, ఆపై ఇలా క్షమాపణలు చెప్పడం ఎందుకు అంటూ సినీ వర్గాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.