Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ మౌనవ్రతం పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్ధంతి సందర్బంగా ఆమెకు నివాళిగా మౌనవ్రతం ప్రారంభించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ ఆనందాన్ని అత్తతో పంచుకునేందుకు దినకరన్ జైలుకు వెళ్లడంతో మౌనవ్రతం విషయం తెలిసింది. దినకరన్ కలిసినప్పుడు శశికళ చూపులు, చిరునవ్వులతోనే మాట్లాడారు. దాదాపు అరగంటపాటు దినకరన్ తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకున్నారు. ఈ విషయాన్ని అన్నాడీఎంకె శశికళ వర్గం సెక్రటరీ పుహళేంది మీడియాకు చెప్పారు. జనవరిలో శశికళ మౌనవ్రతాన్ని వీడనున్నారు.
అక్రమార్జన కేసులో ఈ ఫిబ్రవరిలో ఆమె జైలుకు వెళ్లిన తర్వాత అన్నాడీఎంకెలో పరిణామాలన్నీ వేగంగా మారిపోయాయి. శశికళ స్వయంగా ఎంపిక చేసినముఖ్యమంత్రి పళనిస్వామి ఆమెకు ఎదురుతిరిగారు. శశికళ వ్యతిరేక వర్గం పన్నీర్ సెల్వంతో జట్టుకట్టారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి అన్నాడీఎంకెలో శశికళ వర్గీయులను బయటకు పంపించారు. శశికళకు దాదాపు అన్నాడీఎంకెతో సంబంధం లేకుండా చేశారు. దీంతో ఇక రాజకీయాల్లో శశికళ ప్రాభవం ముగిసినట్టేనని అంతా భావిస్తున్న తరుణంలో… ఆమె మేనల్లుడు దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అనూహ్య విజయం సాధించారు. ఈ గెలుపు శశికళ వర్గంలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఆర్కేనగర్ విజయం స్ఫూర్తితో అన్నాడీఎంకెలో తిరిగి పట్టు సాధించాలని శశికళ భావిస్తున్నారు. జైలు నుంచే దీనికి ప్రణాళికలు రచిస్తున్నారు.