ఈవీఎంలను టాంపరింగ్ చేయొచ్చు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లే వాడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పేపర్ బ్యాలెట్ల వినియోగం కుదరదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఈవీఎం లను హ్యాకింగ్ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈవీఎంల వినియోగానికి ససేమిరా అంటున్నాయి. కాగా ఈ వివాదంపై ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా స్పందించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. తిరిగి కాగితం బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదని మేం ఈవీఎంలనే కొనసాగిస్తామని 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయని, కొందరు గెలిచారని కొందరు ఓడిపోయారని గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే, ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలేం ఫుట్బాల్ కాదని దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్ యంత్రాలను కూడా తీసుకొచ్చామని ఇంకేమీ చేయలేమని సునిల్ అరోరా చెప్పుకొచ్చారు.