Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంటార్కిటికా అంటే శీతల ఖండం. మనిషి జీవించటానికి కాదు కదా…సరైన జాగ్రత్తలు లేకుండా అక్కడ అడుగుకూడా పెట్టలేని వాతావరణ పరిస్థితి. ఇక సృష్టిలోని మిగిలిన జీవుల సంగతి చెప్పేదేముంది? జంతువులు కానీ, పక్షులు కానీ…ఏ ఇతరజీవి కాని అక్కడ మనుగడ సాగించలేదు. అంటార్కిటికా గురించి ప్రపంచానికి తెలిసిన సంగతి ఇది. కానీ దీనికి విరుద్ధంగా అక్కడో రహస్యప్రపంచం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ దిశగా పరిశోధనలు ముమ్మరం చేశారు. అంటార్కిటికా మంచు దుప్పటి కింద మరో ప్రపంచం ఉందని శాస్త్రవేత్తలు భావించటానికి కారణం అక్కడి గుహల్లోఉన్న మట్టినమూనాలో లభించిన డీఎన్ ఏ బాహ్య ప్రపంచంలోని మొక్కలు, జంతువుల జన్యువులతో పోలి ఉండటమే. ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల అంటార్కిటికా పర్యటనకు వెళ్లారు. అక్కడి రోస్ ద్వీపం వద్ద ఉన్న ఎరెబస్ పర్వతం పరిసరాల్లో వారికి గుహలు కనిపించాయి. ఈ గుహలను ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆసక్తిగా అనిపించటంతో శాస్త్రవేత్తలు అక్కడి మట్టి తీసుకువెళ్లి పరీక్షలు జరపటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఆధారాన్ని బట్టి అంటార్కిటికా గుహల్లో రహస్య జీవుల జాడ ఉందని తెలిసినప్పటికీ…ఆ జీవులు ఇంకా బతికే ఉన్నాయా…? అవి ఎలా ఉంటాయి? అక్కడి మొక్కల ప్రత్యేకతలేంటి…వంటి వివరాలు తెలుసుకోవటానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అంటార్కిటికా మంచుదిబ్బలు చల్లగా ఉన్నప్పటికీ…వాటి కింద ఉన్నగుహలు మాత్రం వెచ్చగా ఉన్నాయి. జీవుల అభివృద్ధి , సంతానోత్పత్తికి అవసరమైన 25డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటార్కిటికాలో అగ్ని పర్వతాలు ఎక్కువ. చాలా ఏళ్ల క్రితం ఇలాంటి పర్వతాలు జ్వలించి గుహలుగా ఏర్పడ్డాయి. తర్వాత వాటిపై మంచుదిబ్బలు వెలిశాయి.
అంటార్కిటికా పర్యటనకు వెళ్లి అక్కడి మట్టి తీసుకు వచ్చి పరిశోధనలు జరిపిన బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ప్రాసెర్ ఆ గుహల్లో జీవజాలం కచ్చితంగా నివసించి ఉంటుందని నమ్ముతున్నారు. మంచుకప్పిన ఆ గుహల ద్వారాలు కాంతిమంతంగా ఉన్నాయని, లోనికి వెళ్లిచూస్తే 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని ఆయన తెలిపారు. ఈ గుహలు ఎలా ఏర్పడ్డాయో, వాటిలోపల ఇంకెన్ని అద్భుతాలు ఉన్నాయో త్వరలోనే తెలుసుకుంటామని ఆయన చెప్పారు. పోలార్ బయాలజీ పత్రిక దీనిపై ప్రత్యేకమైన కథనం ప్రచురించటంతో రహస్య ప్రపంచం విషయం బయటకు తెలిసింది.
మరిన్ని వార్తలు: