Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ రోహ్ తక్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. 15 ఏళ్ల క్రితం నమోదైన అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించటంతో పంచకుల కోర్టు నుంచి ఆయన్ను రోహ్ తక్ జైలుకు తరలించారు. లక్షల మంది భక్తులు, వేల కోట్ల ఆస్తులు, జడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో వీవీఐపీ మాదిరిగా ఉండే గుర్మీత్ పై అసలు కేసు ఎలా నమోదయింది…ఆయనపై ఫిర్యాదు చేయటానికి ఎవరు ముందుకొచ్చారు అన్నది అత్యంత ఆసక్తి కరం. ఎందుకుంటే..హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో తన హవా నడిపించే గుర్మీత్ కు అక్కడ రాజకీయంగా ఎంత పలుకబడి ఉందంటే..పార్టీలతో సంబంధం లేకుండా…ఎమ్మెల్యేలు మొదలు మంత్రులు దాకా అందరూ ఆయనకు పాదాభివందనాలు చేస్తుంటారు.
మరి అంతటి పలుకుబడి గల వ్యక్తిపై ఫిర్యాదుచేయటమంటే మాటలు కాదు..సాధారణ కేసుల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేయటం కుదరదు. అందుకే గుర్మీత్ కటకటాల పాలవ్వటానికి కారణమైన అత్యాచార బాధితురాలు ఓ లేఖ ద్వారా ఆయన లీలలు బహిర్గతం చేసింది. వారికీ వీరికీ ఫిర్యాదుచేసినా ఫలితం లేదని భావించిన ఆమె అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి రహస్య లేఖ రాసింది. ఆ లేఖలో బాధితురాలు వెల్లడించిన విషయాలు చూస్తే…ఇప్పటికీ భయభ్రాంతులు కలుగుతాయి. ఆ లేఖ సారాంశం ఇది. నేను పంజాబ్ కు చెందిన యువతినని, గుర్మీత్ బాబా భక్తులు అయిన నా తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆశ్రమంలో చేరాను. కొన్ని రోజుల తరువాత రాత్రి పదిగంటల సమయంలో బాబా ప్రధాన భక్తురాలు గురుజోత్ నా దగ్గరకు వచ్చి బాబా గదిలోకి వెళ్లమని చెప్పింది. నేను ఆ గదిలోకి వెళ్లేసరికి బాబా బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడు. నన్ను చూసి టీవీ ఆఫ్ చేశాడు. తన పక్కన కూర్చోమని ఆదేశించి…నాపై అత్యాచారం చేయబోయాడు. నేను అడ్డుకోటానికి ప్రయత్నించే సరికి తనను దేవుడిగా భావించమన్నాడు. దేవుడు ఇలాంటి పనులు చేస్తాడా అని నేను ప్రశ్నించాను.
360 మంది గోపికలతో శృంగారం సాగించిన కృష్ణుణ్ని లాంటి వాణ్ని అని బాబా చెప్పాడు. హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రుల తన కాళ్లు మొక్కుతారని చెప్పాడు. తాను చెప్పినట్టు చేయకపోతే… రివాల్వర్ తో కాల్చి చంపుతానని, నా కుటుంబ సభ్యులను చంపివేస్తానని బెదిరించి నా పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆశ్రమంలో ఇలాంటి పరిస్థితి నా ఒక్కదానిదే కాదు…అక్కడ ఉన్న మహిళందరిపై రోజుకొకరు చొప్పున బాబా ఈ అఘాయిత్యానికి ఒడిడగడుతున్నాడు. ఆశ్రమంలో 45-30 సంవత్సరాల మధ్య వయసుఉన్న అవివాహిత మహిళలు 40 మంది వరకూ ఉన్నారు. పెళ్లి వయసు దాటిపోవటం, వారి తల్లిదండ్రులు బాబాకు మూఢభక్తులు కావటంతో వారంతా రాజీపడి బతుకుతున్నారు. మేమంతా తెల్లటి దుస్తులు, ముఖానికి ముసుగు వేసుకోవాలని, మగవారికి 10 అడుగుల దూరంలో ఉండాలని గుర్మీత్ ఆదేశిస్తారు. చూసేవారు మేం దేవతల్లా జీవిస్తున్నాం అనుకుంటారు….కానీ మా జీవితాలకు, వ్యభిచారుల జీవితాలకు తేడా ఏమీ లేదు. ఆశ్రమంలోని సాధ్విలందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తే…గుర్మీత్ అక్రమాలు వెలుగులోకివస్తాయి.
ఈ లేఖతో అయినా దయచేసి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లే్ఖ అప్పట్లో సంచలనం సృష్టించింది. దీనిపై తక్షణమే స్పందించిన అప్పటి ప్రధాని వాజ్ పేయి గుర్మీత్ పై సీబీఐ విచారణకు ఆదేశించారు. 15 ఏళ్ల పాటు విచారణ జరిగిన తరువాత కోర్టు బాబాను దోషిగా నిర్ధారించింది. బాబా అసలు స్వరూపం గ్రహించి ఓ బాధితురాలు ఎలాగోలా ధైర్యం చేసి ప్రధానికి లేఖ రాయటంతో గుర్మీత్ చేసే దారుణాల గురించి అందరికీ తెలిసింది. లేకపోతే ఇప్పటికీ డేరా సచ్చా సౌదాలో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలిసేది కాదు. గుర్మీత్ పై ఆరోపణలు వెలుగులోకి వచ్చిందీ…ఆయన దోషిగా ఖరారయిందీ బీజేపీ పాలనా కాలంలోనే కావటం గమనార్హం.