డేరా బాబా తీర్పుపై కేంద్రంలో టెన్ష‌న్

Central Government tension on Gurmeet Baba Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]  

డేరా బాబాకు సోమ‌వారం సీబీఐ కోర్టు శిక్ష ఖ‌రారు చేయ‌నున్న నేప‌థ్యంలో కేంద్రంలో  టెన్ష‌న్ నెల‌కొంది. గుర్మీత్ ను దోషిగా నిర్దారిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు త‌రువాత పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లో త‌లెత్తిన హింస‌ను అడ్డుకోవ‌టంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో కేంద్రం, హ‌ర్యానా ప్ర‌భుత్వాలు ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాయి.

తీర్పు త‌రువాత రెండు రాష్ట్రాల్లో చెల‌రేగిన హింస‌పై ఉమ్మ‌డి హైకోర్టు  హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అదుపులోకి తేలేక‌పోయాయ‌ని, న‌రేంద్ర‌మోడీ బీజేపీకి ప్ర‌ధాని కాద‌ని, దేశానికి ప్ర‌ధాని అని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. హ‌ర్యానా ముఖ్య‌మంత్రిని ప‌రిస్థితుల‌కు లొంగిపోయారు అని తీవ్రంగా ఆక్షేపించింది. ఈ నేప‌థ్యంలో  శాంతిభ‌ద్ర‌త‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతోంది.

దోషిగా ఖ‌రారు చేసిన‌ప్పుడే ఇంత హింస చెల‌రేగితే..ఇక శిక్ష వేసిన‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉంటుందో అని అంచ‌నా వేస్తోంది. పంచ‌కుల‌, సిర్శాతో పాటు పంజాబ్‌, హ‌ర్యానా, నోయిడా, ఢిల్లీ శివార్ల‌లో భారీ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించింది. డేరా అనుచ‌రుల విధ్వంసం వ‌ల్ల జ‌రుగుతున్న న‌ష్టానికి ఆయ‌న ఆస్తులు అమ్మి ప‌రిహారం చెల్లించాల‌ని కోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ అదంత సుల‌భం కాద‌ని కేంద్రం భావిస్తోంది. శిక్ష ఖ‌రారు త‌ర్వాత గుర్మీత్ అనుచ‌రులు భారీ ఎత్తున విధ్వంసాల‌కు దిగ‌వ‌చ్చ‌నీ, ప్రాణ‌, ఆస్తి న‌ష్టం భారీ స్థాయిలో ఉండ‌వ‌చ్చ‌ని ఇంటెలిజెన్స్ హెచ్చ‌రించింది. దీంతో స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాలన్నింటినీ కేంద్రం త‌న ఆధీనంలోకి తీసుకుంది. అటు హ‌ర్యానా ప్ర‌భుత్వం కూడా భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసింది.

రోహ్ త‌క్ లోకి డేరా అనుచ‌రుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని పోలీసులు తేల్చిచెప్పారు.  డేరా ఆశ్ర‌మం ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న సిర్శాలో క‌ర్ఫ్యూ విధించారు.  గుర్మీత్ ను ఉంచిన జైలునే సీబీఐ న్యాయస్థానంగా మార్చ‌నున్నారు. ఇందుకోసం జైలులో ఓ ప్ర‌త్యేక గ‌ది ఏర్పాటు చేశారు. శిక్ష ఖ‌రారు చేసేందుకు సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తిని ప్ర‌త్యేక విమానంలో రోహ్ త‌క్ త‌ర‌లించ‌నున్నారు. అటు ప్ర‌తి నెలా దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి రేడియోలో చేసే మ‌న్ కి బాత్ ప్ర‌సంగంలో ప్ర‌ధాని హ‌ర్యానా ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించారు. హింస‌ను స‌హించేది లేద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ చ‌ట్టాల‌ను గౌర‌వించాల్సిందేన‌ని స్ప‌ష్టంచేశారు. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే అని త‌ప్పు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ శిక్ష ప‌డుతుంద‌ని తేల్చిచెప్పారు.