Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ నేపాల్ పర్యటనపై కాంగ్రెస్ మండిపడుతోంది. ప్రధాని పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తోంది. కర్నాటక ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతోనే సరిగ్గా పోలింగ్ రోజు ప్రధాని నేపాల్ వెళ్లారన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ప్రచార సమయం ముగిసే ముందురోజు వరకు కర్నాటకలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని అనంతరం రెండురోజుల పర్యటన కోసం నేపాల్ బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ లో భాగంగా ముందుగా శుక్రవారం జనక్ పూర్ లోని జానకీ ఆలయాన్ని సందర్శించిన మోడీ శనివారం ముక్తినాథ్, పశుపతి నాథ్ ఆలయాలను సందర్శించారు. ఈ రెండు ఆలయాల్లోనూ శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు.
కర్నాటకలోని లింగాయత్ లు శివుణ్ని ఈ రూపంలోనే పూజిస్తారు. ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా కర్నాటక ప్రజల్ని ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతోనే ప్రధాని నేపాల్ లో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకోడ్ అమలులో ఉన్నప్పుడు పీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశాలు వెళ్లడమేమిటని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ప్రశ్నించారు. మోడీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని, మోడీ నిర్ణయం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. మోడీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా….కర్నాటకలో గెలుపు కాంగ్రెస్ దేనన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పుకొచ్చారు.