Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సరదా ట్వీట్లతో అభిమానుల్ని అలరించే సెహ్వాగ్ అప్పడప్పుడూ కొన్ని స్ఫూర్తిదాయక పోస్ట్ లు చేస్తుంటాడు. ఆ కోవలో హైదరాబాద్ రోడ్ల గురించి ఆయన చేసిన ఓ పోస్ట్ ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే సెహ్వాగ్ హైదరాబాద్ గురించి ఎలా తెలుసుకున్నారో ఏమో కానీ కొన్ని ట్వీట్లు చేశాడు. గంగాధర్ తిలక్ కట్నం అనే వ్యక్తి హైదరాబాద్ రోడ్లను బాగుచేసేందుకు కృషిచేస్తున్న వైనాన్ని ఆ ట్వీట్లలో వివరించాడు. రోడ్లపై పడే గుంతలను గంగాధర్ తిలక్ ఎలా పూడ్చుతున్నారో సెహ్వాగ్ తెలియజేశాడు.
రైల్వేలో ఉద్యోగం చేసి రిటైరయిన గంగాధర్ తిలక్ హైదరాబాద్ రోడ్ల కోసం పడుతున్న తాపత్రయం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. తనకు తెలిసిన మేరలో రోడ్లపై ఎక్కడ గుంత కనపడినా తిలక్ ఆ గుంతను స్వయంగా పూడుస్తారు. ప్రతిరోజూ ఆయన తారు మిశ్రమాన్ని 8 నుంచి 10 బ్యాగుల్లో నింపుకుని రోడ్డుమీదకు వస్తారు. ఎక్కడ గుంత కనపడినా దాన్ని వెంటనే పూడ్చివేస్తారు. ఆయన ఇలా చేయటానికి ఓ కారణం ఉంది.
ఒకరోజు తిలక్ తన కారులో వెళ్తుండగా గుంతలో టైర్ దిగి వెంటనే ఆ నీరు పక్కనే ఉన్న వీధి బాలలపై పడింది. అది చూసిన తిలక్ కు చాలా బాధ కలిగింది. వెంటనే తన జేబులోనుంచి రూ5వేలు తీసి అక్కడ ఉన్న గుంతను పూడ్పించారు తిలక్. అప్పటినుంచి ఆయన ఇలా గుంతలను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. ఈ విషయాలను సెహ్వాగ్ ట్విట్టర్ లో తెలియజేశారు. తిలక్ గుంత పూడుస్తున్న ఫొటోను కూడా పోస్ట్ చేసిన సెహ్వాగ్ సమాజం పట్ల తిలక్ కనబరుస్తున్న అంకిత భావానికి మనందరం సెల్యూట్ చేద్దాం అని కూడా కామెంట్ చేశాడు. రోడ్లపై గుంతల మూలంగా హైదరాబాద్ వాసులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అయినా అందరూ ప్రభుత్వాన్ని తిట్టుకునే వాళ్లే కానీ ఇలా రోడ్లను బాగుచేసేందుకు ఒక్కరూ ముందుకురారు. కానీ తిలక్ స్వయంగా గుంతలు పూడ్చే బాధ్యత తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరిన్ని వార్తలు: