తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీలలో చేరికలు మొదలయ్యాయి. అయితే అధిక శాతం అధికార పార్టీ వంక చూస్తోంటే మరికొందరు మాత్రం వైసీపీ వంక చూస్తున్నారు. తాజాగా ఏపీలో టీడీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, కృష్ణ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ రమేశ్ నాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఫ్యాక్స్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నా సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని, అందుకే రాజీనామా చేశానని రమేశ్ నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా ప్రతినిధిగా, ప్రజా ప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేసినట్టు ఆయన తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ సేవలను వాడుకుని ఇపుడు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. భవిష్యత్లో ఏ పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తన అనుచరులతో చర్చింది దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని రమేశ్ పేర్కొన్నారు.
తాజాగా బూరగడ్డ వేదవ్యాస్ కు మఛిలీ పట్నం అర్బన్ డెవెలప్ మెంట్ అధారిటీ ఛెయిర్మన్ పదవి రావడంతో రమేశ్ నాయుడు కినుక వహించారు. తనని పార్టీ పక్కన పెట్టి కొత్త గా పార్టీలో చేరిన వారికి పదవులిస్తున్నదని ఆయన భావిస్తున్నారు. ఆయన సీనియర్ కాపు నాయకుడు కాబట్టి ఆయనను తమ పార్టీలోకితీసుకునేందుకు వైసిపితోపాటు, బిజెపి, జనసేన ప్రయత్నించవచ్చు. మూడు పార్టీలకు ఆయన అవసరమే అయినా వైసీపీ అయితే ఆయనకీ రాజాకీయంగా లాభించవచ్చు.