తెలంగాణలో కాంగ్రెస్‌కే షాక్‌ ఇచ్చిన సీనియర్లు.. టికెట్‌ అడగలేదు.!

Seniors who shocked the Congress in Telangana.. did not ask for tickets!
Seniors who shocked the Congress in Telangana.. did not ask for tickets!

తెలంగాణలో కాంగ్రెస్‌ అనగానే పంచాయితీలు, గొడవలు, ఆధిపత్య పోరు గుర్తొస్తాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. ఈ క్రమంలో టికెట్ల విషయంలోనూ కొందరు సీనియర్లు సైలెంట్‌గా ఉండడం గమనార్హం. టికెట్‌ కోసం పోటీ పడి.. గాంధీ భవన్‌లో ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈసారి అలా జరగదనే నమ్మకం లేదు. కానీ, సీనియర్లు టికెట్‌ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ఇవాల్టితో ముగిసింది. దాదాపు వెయ్యిమంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు వెల్లడించాయి.

సీనియర్లు దూరం..

చివరిరోజు పెద్ద ఎత్తున ఆశావహులు గాంధీభవన్‌ కు తరలివచ్చారు. అయితే, పలువురు సీనియర్‌ నేతలు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
మాజీ మంత్రి జానారెడ్డి, సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, గీతారెడ్డి, రేణుకా చౌదరి, జి. నిరంజన్, కోదండరెడ్డి, మల్లు రవి దరఖాస్తు చేయలేదు.

దరఖాస్తు చేసిన ప్రముఖులు..

కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎల్బీనగర్‌ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నాగార్జున సాగర్‌ నుంచి జానారెడ్డి కుమారులు రఘువీర్‌ రెడ్డి, రెడ్డిలు దరఖాస్తు చేసుకున్నారు. సనత్‌ జయవీర్‌ నగర్‌ టికెట్‌ కోసం మర్రి శశిధర్‌ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.

తాండూరు టికెట్‌కు ఫుల్‌ డిమాండ్‌..

తాండూరు కాంగ్రెస్‌ లో అసెంబ్లీ టికెట్‌ దరఖాస్తుల కోలాహలం మొదలైంది.బయోడేటాలతో గాంధీ భవన్‌ కు అసెంబ్లీ సీట్‌ లను కన్ఫర్మ్‌ చేసుకునేందుకు క్యూ కట్టారు. తమకే సీటు దక్కేలా తమ తమ గాడ్‌ ఫాదర్‌ ల పైరవీలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.ఎమ్మెల్యే సీటు కోసం ఆర్థిక, అంగబలాల ప్రదర్శన చేస్తూ దరఖాస్తులను అందజేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్‌ బీ ఫార్మ్‌ తనకే దక్కాలనే పట్టుదలతో గాంధీభవన్‌ వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో ముఖ్యంగా పలు నేతలు టికెట్‌ కోసం కుస్తీ పడుతున్నారు.

రికమండేషన్‌ ..

ఈసారి ఎలాగైనా తెలంగాణ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నం చేస్తుంది. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆశావహులు టికెట్‌ కోసం ఎవరికి వారు రికమండేషన్లు చేస్తున్నారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రమేష్‌ మహారాజ్‌కు రికమండేషన్‌ ఉన్నట్లు సమాచారం. రఘువీర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి రేవంత్‌రెడ్డి రికమండేషన్‌ ఉన్నట్లు తెలుస్తుంది. వికారాబాద్‌ జిల్లా చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ సుధాకర్‌రెడ్డిని ప్రోత్సాహిస్తున్నారు. సునీత సంపత్‌ దరఖాస్తు చేస్తే.. రేవంత్‌రెడ్డి రికమండేషన్‌ ఉన్నట్లు సమాచారం. ధారాసింగ్, జనార్దన్‌రెడ్డి, ఉత్తమ్‌ చంద్, కల్వ సుజాత,మాజీ క్రికెటర్‌ అజహారుద్దీన్‌,మర్రి ఆదిత్య రెడ్డిలకు కాంగ్రెస్‌ పెద్దల ప్రోత్సహం ఉంది. తాండూరు అసెంబ్లీ స్థానం టికెట్‌ ఎవరికి దక్కుతుందో..? అని జిల్లా వ్యాప్తంగా జోరు చర్చలు కొనసాగుతున్నాయి.