Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం ‘శతమానంభవతి’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన యువ హీరో శర్వానంద్ తన తర్వాత సినిమాను రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో చేయాల్సి ఉంది. ‘బాహుబలి’ నిర్మాతలు వీరి కాంబో మూవీని నిర్మించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతుంది. అసలు ఆ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న కారణంగా శర్వానంద్ తన తర్వాత సినిమాను హనురాఘవపూడి దర్శకత్వంలో చేసేందుకు కమిట్ అయ్యాడు. 14 రీల్స్ బ్యానర్‌లో శర్వా, హనుల కాంబో మూవీ వచ్చే నెలలో షురూ కాబోతుంది.
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అంటూ ఒక మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని చేసి అందరి దృష్టిని ఆకర్షించిన హను తాజాగా నితిన్‌తో ‘లై’ చిత్రాన్ని తెరకెక్కించి డిజాస్టర్ ఫలితాన్ని చవిచూశాడు. 14 రీల్స్ వారికి ఆ సినిమా వల్ల భారీ నష్టం వాటిల్లినట్లుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మరోసారి హను దర్శకత్వంలో 14రీల్స్ వారు సినిమా చేసేందుకు సిద్దం అయ్యారు. ఇక ‘లై’ ఫలితం చూసి కూడా శర్వానంద్ ఈ సాహస నిర్ణయం తీసుకోవడంతో కొందరు ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. శర్వానంద్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడా లేదా ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది కనుక వెంటనే ఏదో ఒక సినిమా అని ఈ సినిమా చేస్తూ ఉంటాడా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం శర్వానంద్ కోసం దర్శకుడు హను స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. హను చెప్పిన స్టోరీ లైన్ నచ్చడం వల్లే వెంటనే శర్వానంద్ ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఓకే చెప్పడం జరిగింది. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే శర్వానంద్ ఈ సినిమా విషయంలో కూడా అంత తొందరపాటు నిర్ణయం ఏమీ తీసుకోడు అంటున్నారు సినీ వర్గాల వారు. హను ‘లై’ సినిమా ఫ్లాప్ అవ్వొచ్చు, కాని అతడు మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు అంటూ కొందరు సినీ ప్రముఖులు కూడా అంటున్నారు. అందుకే శర్వా ఈ సినిమాకు కమిట్ అయ్యి ఉంటాడు. 2018 ద్వితీయార్థంలో వీరి కాంబో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. హను దర్శకుడిగా ఈ సినిమాతో నిరూపించుకుంటాడా అనేది చూడాలి.