Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- రూ.కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారు. చిన్న సాయం చేసేందుకు ముందుకు రారు
- టాలీవుడ్ హీరోయిన్ల తీరుపై మా ఆగ్రహం
ప్రస్తుతం తెలుగుసినిమాల్లో సొంత భాష హీరోయిన్లు దాదాపుగా లేరు. స్టార్ హీరోయిన్స్ అంతా ఇతర భాషలనుంచి వచ్చి ఎదిగిన వారే. అయితే ఎన్ని సినిమాలు చేసి, ఎంత డబ్బు, స్టార్ డమ్ తెచ్చుకున్నా తెలుగును సొంత భాషలా, తెలుగు రాష్ట్రాలను సొంత ప్రాంతాలుగా భావించరనేది హీరోయిన్లపై ప్రధానంగా వచ్చే ఆరోపణ. తమతో కలిసి నటించే హీరోలు చురుగ్గా పాల్గొనే కార్యక్రమాల్లోనూ హీరోయిన్లు అంటీముట్టనట్టే ఉంటారు. ఏ విషయంలోనూ బాధ్యతగా భావించరు. ఈ తీరు మిగతావారికేమో కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ నటుడు శివాజీ రాజాకు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. హీరోయిన్లు తమకు సహకరించడం లేదని, ఆరోపించిన ఆయన తోక జాడిస్తే…కత్తిరిస్తాం అని తీవ్ర హెచ్చరికలు చేశారు.
తెలుగు రాష్ట్రాలకు వచ్చి కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటున్న హీరోయిన్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలకు బతిమాలినా రావడం లేదని, తాము చేపట్టే ఏ మంచి పనికీ సహకరించడం లేదని శివాజీరాజా మండిపడ్డారు. తాము అమ్మా..అమ్మా అని బతిమలాడుతున్నామని, అయినా సరే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు మాత్రమే సాయం చేస్తున్నారని, మరికొందరు మేనేజర్ల మీదకు తోసేస్తున్నారని, ఇలాంటివన్నీ కుదరవని శివాజీరాజా స్పష్టంచేశారు. తామూ చిత్రపరిశ్రమలో 30 ఏళ్ల నుంచి ఉంటున్నామని, చాలా మంది హీరో,హీరోయిన్లను చూశామని అన్నారు. హీరోయిన్లు ఎవర్నీ తాము డబ్బులు అడగడం లేదని, కార్యక్రమానికి వస్తే తామే ఇస్తామంటున్నామని, కాకపోతే వారు అడిగినంత ఇవ్వలేకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, వెంకటేశ్, నాగార్జున తదితర పేరున్న హీరోలెందరో తమ అసోసియేషన్ కు విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారని, హీరోయిన్లు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నిర్మాతలు ఇచ్చిన ఏవైనా చెక్కులు బౌన్స్ అయితేనే సభ్యత్వం కోసం తమ వద్దకు పరిగెత్తుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. మా అసోసియేషన్ కు సహకరించిన హీరోయిన్లు ఫొటోలను గోడలపై పెట్టుకుంటామని, తోక జాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివాజీ వ్యాఖ్యలకు నటుడు నరేశ్ కూడా మద్దతు పలికారు. హీరోయిన్లు తప్పనిసరిగా మా సభ్యత్వం తీసుకోవాల్సిందేనని, వారంతా టాలీవుడ్ కార్యక్రమాల్లో పాల్గొనకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.