వరల్డ్ కప్ ముగుస్తున్న నేపథ్యంలో పలు జట్లకి సంబంధించిన సీనియర్ ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటిస్తుండడం క్రికెట్ అభిమానులని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా హైదరాబాద్ అల్లుడు, సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ తాను అంతర్జాతీయ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా షోయబ్ ఈ విషయాన్ని ప్రకటించగా, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. తనతో ఆడిన ఆటగాళ్ళకి, శిక్షణ ఇచ్చిన కోచ్‌లకి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీడియా, స్పాన్సరర్స్ కు ఈ సందర్బంగా షోయబ్ ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ప్రపంచకప్ అధికారిక ట్విట్టర్ తమ ట్విట్టర్‌లో పాకిస్థాన్ టీం షోయబ్ మాలిక్‌కి గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న వీడియోని షేర్ చేసింది.
బ్యాట్‌తోనే కాకుండా బాల్‌తోను పాకిస్థాన్‌కి ఎన్నో మరపురాని విజయాలు అందించిన షోయబ్ మాలిక్ ఈ వరల్డ్ కప్‌లో కేవలం మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా, భారత్‌లపై అతను డకౌట్ అయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో రెండో బంతికి, టీమిండియాతో మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు షోయబ్ . ఈ క్రమంలో అతనిని మిగతా మ్యాచ్‌లకి ఎంపిక చేయలేదు. అయితే ఫేర్‌వెల్ మ్యాచ్‌లోనైన ఆడిస్తారని అనుకున్నప్పటికి పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ యధావిధిగా అతనని పక్కన పెట్టింది. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు . వన్డేలలో షోయబ్ మాలిక్ 9 సెంచరీలు, 44 అర్ద సెంచరీలు చేశారు.