Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీకి ప్రత్యేక హోదా అంశం కర్నాటక ఎన్నికల్లోనూ ప్రచారాస్త్రంగా మారింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యంపై ఏపీ ప్రజలే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా ఏపీ పొరుగున ఉన్న కర్నాటకలో స్థిరపడిన తెలుగు ప్రజలు బీజేపీ తీరుపై మండిపడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి… టీడీపీ కూడా… కర్నాటకలో బీజేపీకి తెలుగు ప్రజలు బుద్ధి చెబుతారని పదే పదే హెచ్చరికలు చేస్తూనే ఉంది. మోడీ తీరుపై కర్నాటకలోని తెలుగు ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో… బీజేపీ వ్యతిరేకతను తమకు సానుకూలంగా మలుచుకోవడానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారు.
కర్నాటకలోని తెలుగువారికి లేఖ రాసిన ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 95శాతం అమలుచేశామని, తమకు మళ్లీ అవకాశం కల్పించాలని అందులో విజ్ఞప్తిచేశారు. తెలుగు, కన్నడ ప్రజలది తరతరాల సోదరబంధమని, దశాబ్దాలుగా తెలుగువారు ఇక్కడ స్థిరపడి కన్నడ సంస్కృతిలో భాగమయ్యారని అన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలుచేయకుండా బీజేపీ ద్రోహంచేసిందని, విభజన హామీలు అమలుచేయకుండా ఏపీ, తెలంగాణకు అన్యాయం చేసిందని సిద్ధరామయ్య ఆరోపించారు. తాజగా జరిపిన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశామని సిద్ధరామయ్య చెప్పారు. మొత్తానికి బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధరామయ్య తెలుగు ఓట్లకు గాలం వేసే పనిలో పడ్డారు.