Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన బాధిత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ చేసిన మోసంపై ఏపీలోనే కాదు… దేశవ్యాప్తంగానూ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్నాటకలో ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి ప్రజలు బాగా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి… తర్వాత బీజేపీ నమ్మకద్రోహం చేస్తుందనడానికి ఏపీ విషయమే ఉదాహరణగా భావిస్తున్నారు… బీజేపీ ప్రత్యర్థులుకూడా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏపీకి ప్రత్యేక హోదా గురించి ట్విట్టర్ లో ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ ప్రామిస్ చేశారని, అయితే చివరకు ప్రత్యేక హోదాతో పాటు చంద్రబాబును కూడా తొక్కేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ తరహాలో కర్నాటక రాష్ట్రానికి కూడా ఎలాంటి హామీలనైనా ఇవ్వడానికి మోడీ ఏమాత్రం సంశయించడంలేదని, కానీ ఆయన హామీలను ఓటర్లు నమ్మవద్దని సిద్ధరామయ్య కోరారు. ఏపీకి మోడీ చేసిన మోసానికి కర్నాటకలోని తెలుగువారు బుద్ధిచెబుతారని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని… టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ సహా మిత్రపక్షాలన్నీ ఒక్కొక్కటిగా దూరమవడం, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండడం… వంటి పరిణామాల నేపథ్యంలో కర్నాటకంలో గెలవడం ద్వారా…. రాజకీయంగా మళ్లీ పై చేయిసాధించాలనీ బీజేపీ భావిస్తుండగా… కర్నాటక ఓటమి ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.