భారతీయులకు క్రికెట్ అంటే పిచ్చి. సింగపూర్‌లో ఉంటున్న ఓ భారతీయుడు కూడా టీమిండియాను తెగ ఇష్టపడుతాడు. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కోహ్లీసేనను చూసేందుకు మాథుర్ ఫ్యామిలీ ఓ భారీ సాహసాన్ని చేసింది. సింగపూర్ నుంచి లండన్ వరకు మాథుర్ ఫ్యామిలీ కారులో ప్రయాణించారు. వాస్తవానికి వీళ్లు చెన్నైకు చెందినా.. గత 14 ఏళ్లుగా సింగపూర్‌లోనే ఉంటున్నారు. సుమారు 22 వేల కిలోమీటర్లు కారులో వెళ్లారంటే ఆషామాషీ కాదు. క్రికెట్ మీద అభిమానమే కాదు.. ఆ ఫ్యామిలీ మొత్తం వరల్డ్టూర్ను ఎంజాయ్ చేశారు. ఏడు సీట్ల టొయోటా వెల్ఫైర్ కారులో ఫ్యామిలీ మొత్తం ప్రయాణించింది. మొత్తం 17 దేశాల మీదుగా వాళ్లు వెళ్లారు. 46 రోజుల పాటు వాళ్లు జర్నీ చేశారు. అయితే గత శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ను వీక్షించారు. ఇవాళ సెమీస్ మ్యాచ్‌ను కూడా మాథుర్ ఫ్యామిలీ తిలకించనున్నది. ఇండియాకు సపోర్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే లండన్‌కు కారులో బయలుదేరినట్లు మాథుర్ ఫ్యామిలీ పేర్కొన్నది. ఫ్లయిట్లో వెళ్లితే గంటల్లోనే డెస్టినేషన్ చేరుతాం, కానీ జర్నీలో థ్రిల్ ఉండాలన్న ఉద్దేశంతో రోడ్డు రూట్‌ను ప్రిఫర్ చేసినట్లు ఈ సాహసికులు పేర్కొంటున్నారు. అనుపమ్ మాథుర్ తన తల్లి, తండ్రులతో పాటు భార్యాపిల్లల్ని కారులో తీసుకెళ్లాడు. విదేశాల్లో కారు ప్రయాణం చేయడం వీళ్లకు ఇదే మొదటిసారి కాదు. మాథుర్ ఫ్యామిలీ ఎప్పుడూ టూర్‌కు వెళ్లినా కారులోనే ప్రయాణం చేస్తారు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ సుమారు 96 వేల కిలోమీటర్లు తిరిగారు. టీమిండియా మ్యాచ్‌లను తిలకించేందుకు ఈ ఫ్యామిలీ సింగపూర్, మలేషియా, థాయిల్యాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బకిస్తాన్, కజకస్తాన్, రష్యా, ఫిన్‌ల్యాండ్, స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఇంగ్లండ్ చేరుకున్నది. ఉజ్బకిస్తాన్, కిర్గిస్తాన్ దేశాల్లో ఉన్న ప్రకృతి సోయగాలను తనను ఆకట్టుకున్నట్లు అనుపమ్ చెప్పాడు. కొన్ని దేశాల్లో గైడ్ల సాయంతో టూర్ చేశామన్నాడు. ఆర్కిటిక్ సర్కిల్ రూట్లో ప్రయాణించడం సంతోషంగా ఉందన్నాడు.