Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆపరేషన్ గరుడ ఇంకా ఆగలేదని రాజకీయనాయకుడు, నటుడు శివాజీ చెప్పారు. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు మద్దతుగా శివాజీ ప్రసంగించారు. కేంద్రానికి కనువిప్పు కలిగేలా ఆందోళన చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఊరిలో రైల్వే ట్రాక్ పై కూర్చుని ఆందోళన చేద్దామని, రైల్వేకేసులు వద్దనుకుంటే ప్రతి ఊరిలో ఎర్రజెండా పాతితే రైళ్లు ఆగిపోతాయని శివాజీ సూచించారు. ఆపరేషన్ గరుడ ఇంకా ఆగలేదని, రాష్ట్రాన్ని అలజడిలో పెట్టాలని సూచిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా 33వేల ఎకరాలు త్యాగం చేశారని, వారి త్యాగం వృథాకాదని, గొప్ప రాజధాని అవుతుందని శివాజీ విశ్వాసం వ్యక్తంచేశారు. రాజధానిపై కుట్ర చేసేవారి ఆరోపణలు రైతులు నమ్మవద్దని కోరారు.
మద్రాస్ లాంటి గొప్ప రాజధాని ఉండడం వల్లే ఎన్టీఆర్ గొప్ప నటుడు, రాజకీయనాయకుడు అయ్యారని, చిరంజీవి మెగాస్టార్ అయ్యారని ఏం ఇచ్చారని వీళ్లంతా మద్రాస్ వెళ్లారని శివాజీ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని, ఈ నెల 30న అన్ని విషయాలు చెబుతానని శివాజీ వెల్లడించారు. శివాజీ ప్రసంగం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. శివాజీ వేదికపై మాట్లాడుతుండగా… బాలకృష్ణ అక్కడకు వచ్చి శివాజీ పక్కన నిల్చున్నారు. జనాలు రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలు చేపట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించరని, కానీ కేంద్రాన్ని కదిలించాలంటే… అందరం రోడ్డెక్కాల్సిందేనని వ్యాఖ్యానించారు. కర్ర తీసుకుని కొడితేనే గుజరాత్ వాళ్లు వింటారని, మామూలుగా అయితే వారు మాట వినరని, మోడీ మామూలుగా మాటవినరని, బాలకృష్ణ చెప్పినట్టు దండోపాయమే కరెక్టని చెప్పారు. వెంటనే బాలయ్య వైపు తిరిగి ఒక్కసారి తొడగొట్టండి మీరు అని అడిగారు. వెంటనే బాలయ్య తొడకొట్టడంతో అక్కడంతా హుషారు వాతావరణం నెలకొంది. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించిన శివాజీ తొడకొట్టి, మీసం మెలేసి చెబుతున్నామని, ప్రత్యేక హోదా సాధిస్తామని, అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేసుకుంటామని తెలిపారు.