Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సామాజిక విషయాలపై తరచూ స్పందిస్తాడు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నోసార్లు ట్వీట్ చేశాడు. దేశానికి సంబంధించిన విషయాల్లో తరచూ వ్యాఖ్యలు చేస్తూ దేశభక్తిని ప్రదర్శిస్తుంటాడు. అయితే ఇలా ఎందరో సెలబ్రిటీలు ట్విట్టర్ లో తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తుంటారు. కానీ గౌతం గంభీర్ ఇలా మాటలకే పరిమితం కాలేదు. వీలుకుదిరినప్పుడల్లా తన సేవాదృక్పథాన్ని చాటుకుంటున్నాడు.
క్రికెట్ లోకి వచ్చిన కొన్నిరోజుల నుంచే గంభీర్ సేవాకార్యక్రమాల్లోపాల్గొంటున్నాడు. స్వతహాగా కోటీశ్వరుడు అయిన గంభీర్ తన పేరుతో ఓ ఫౌండేషన్ పెట్టి కోట్లాదిరూపాయల ఖర్చుతో సేవాకార్యక్రమాలు చేస్తున్నాడు. చాలామందిలాగా పన్నుమినహాయింపు కోసమో, పేరు కోసమో గంభీర్ ఈ పనిచేయటంలేదు. ఈ కార్యక్రమాలతో సమాజంపై తన నిబద్ధతను చాటుతున్నాడు. కొన్ని నెలల క్రితం నక్సల్స్ దాడిలో మరణించిన 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు చెందిన పిల్లలందరి చదువు బాధ్యతలు తీసుకుని పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన జమ్మూకాశ్మీర్ ఎస్సై అబ్దుల్ రషీద్ కూతురి బాగోగులు చూస్తానని హామీ ఇచ్చాడు.
తండ్రి చనిపోవటంతో భోరున విలపిస్తున్న జోహ్రా ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటోను చూసిన గౌతం గంభీర్ కు మనసు ద్రవించింది. జోహ్రా చదువు ఖర్చు భరించాలని గంభీర్ నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో జోహ్రాకు, గంభీర్ కు మధ్య జరిగిన ఓ సంభాషణ ఆయన దయార్ధ్ర హృదయాన్ని తెలియజేస్తోంది. తనను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన గంభీర్ కు జోహ్రా థ్యాంక్స్ చెప్పింది. దీనికి స్పందించిన గంభీర్ తనకు థ్యాంక్స్‌చెప్పాల్సిన పనిలేదని, నా ఇద్దరు కూతుళ్ల లాగే నువ్వూ అని స్పందించాడు. దీనిపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. గంభీర్ గ్రేట్ అంటూ నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. సెలబ్రిటీలంతా గంభీర్ బాటలో నడవాలని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు: