Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వీరమరణానికి ముందు ఓ జవాన్ రాసుకున్న కవిత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరుడు తన దృష్టిలో బతుకూ, చావూ రెండూ జీవన క్రమంలో భాగమని, మరణమే చివరి చరణం కాదని ఫేస్ బుక్ లో చివరగా రాసుకున్న కవిత అందరి హృదయాలను కలచివేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ సైనికులు ఆదివారం సరిహద్దుల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భారత జవాన్లు కెప్టెన్ కపిల్ కుందు, రామావతార్, శుభమ్ సింగ్, రోషన్ వీరమరణం పొందారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి పాక్ సైనికులు నిరంతరాయంగా మోర్టార్ దాడులుజరిపారు. మెంధార్, మంజకొటే, బాల్కొటే సెక్టార్లలో పాక్ మోర్టార్లు అనేక పౌరఆవాసాలను ధ్వంసం చేశాయి.
పొద్దస్తమానం పాక్ సైన్యం ఇలా కవ్వింపులకు పాల్పడడంతో భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంటూ కాపలా కాస్తోంది. కపిల్, మరో ముగ్గురు సైనికులతో కలిసి బంకర్ ద్వారా ఎదురు కాల్పులు జరుపుతూ వచ్చారు. ఈ క్రమంలో విధుల్లో ఉండగానే కపిల్ రాత్రి ఒంటిగంటకు తన తల్లితో మాట్లాడారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ సైనికులు ప్రయోగించిన ఒక మోర్టార్ నేరుగా వచ్చి కపిల్, రామావతార్, శుభమ్, రోషన్ ఉన్న బంకర్ ను తాకడంతో ఆ నలుగురూ అసువులు బాశారు.
పాక్ దుర్మార్గంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా పాక్ కాల్పుల్లో అమరుడవడానికి ముందు కెప్టెన్ కపిల్ కుందు ఫేస్ బుక్ లో రాసుకున్న మినీ కవిత, ఆయన బయో లో రాసుకున్న వాక్యాలు…సోషల్మీడియాలో వైరల్ అవుతూ పాకిస్థాన్ పై జనాగ్రహం పెల్లుబుకేటట్టు చేస్తున్నాయి. ఎన్నేళ్లు బతికామన్నది కాదు.. ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం అని కపిల్ తన బయోలో రాసుకున్నారు. పరుగెత్తు…జీవితమే ఒక పరుగు
పరుగెత్తలేకపోతే నడువ్…
నడవలేకపోతే…నేలపై పాకు
కానీ విశ్రమించకు…
లక్ష్యం చేరేదాకా విశ్రమించకు
ఎన్నాళ్లు బతికామన్నది కాదు..
ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం
బతుకు, మరణం అన్నీ జీవన క్రమంలో భాగం
మరణమే చివరి చరణం కాదు అని కపిల్ రాసుకున్నారు.
దీంతో పాటు ఒక అమరుడి కథ అన్న పేరుతో కపిల్ పోస్ట్ చేసిన ఓ మినీ కవితను కూడా నెటిజన్లు విపరీతంగా షేర్ చేస్తున్నారు. తను మరణించిన తరువాత కూడా నెచ్చెలికి ప్రతి సందర్భంలోనూ శుభాకాంక్షలు చెబుతూ పువ్వులు అందేలా ముందే ఏర్పాటుచేసినట్టు… ఆ పువ్వుల్ని చూస్తూ ఆమె జీవితం కొనసాగించాలని కోరుకున్నట్టు అర్ధం వచ్చేలా ఉన్న ఆ కవిత అందరినీ కంటతడిపెట్టిస్తోంది. కపిల్ పోస్ట్ లు చదువుతున్న నెటిజన్లు వీరజవాన్లకు నివాళులర్పిస్తూ… దేశభక్తిని చాటుతూ పోస్ట్ లు పెడుతున్నారు. పాక్ పై మరోసారి సర్జికల్ దాడులు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కపిల్ వయసు 23 ఏళ్లు. ఈ నెల 10న ఆయన తన 23వ పుట్టినరోజు తల్లి దగ్గర జరుపుకునేందుకు సెలవు కూడా పెట్టారు.
ఆ రోజు ఇంటికి వస్తానని సోదరితో చెప్పారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఆదివారం రాత్రి చివరిసారిగా తల్లితో మాట్లాడారు కపిల్. తన కొడుకు ఆలోచనలు ఎప్పుడూ దేశం కోసమేనని, అందుకే సైన్యంలో చేరాడని కపిల్ తల్లి సునీత అన్నారు. కపిల్ ధీశాలని, మరో 20 ఏళ్లు బతికినా దేశానికి ఇంత గొప్పగానే సేవ చేసి ఉండేవాడని, అతని త్యాగం వృథాపోదని ఆమె కన్నీళ్లను దిగమింగుకుంటూ చెప్పారు. తనకు మరో కొడుకు పుట్టి ఉన్నా అతన్నీ సైన్యంలోకి పంపేదానన్నని తెలిపారు. అటు పాక్ దుశ్చర్యపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. మొదటిసారి సైన్యం సర్జికల్ దాడులు జరిపినప్పుడు మీడియాకు తెలీదని, పూర్తయ్యాక తెలిసిందని, ఇప్పటికీ పాక్ వైఖరి మారలేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత జవాన్ల వీరమరణాలకు సైన్యం ప్రతీకారం తీర్చుకోవాలని, మరో సర్జికల్ దాడి జరపాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏం చేయాలో సైన్యమే నిర్ణయించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఏం చేసినా నిశీథిలోనే చేయాలని హోంమంత్రి అన్నారు.