Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ పని అయినా మొదలు పెట్టేటప్పుడు ఓ రకమైన ఆశ, అంచనా ఉంటుంది. పనిలో దిగాక కొన్నిసార్లు ఆ ఆశ నిరాశ అవుతుంది. ఆ అంచనా తప్పుతుంది. చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే అంచనాలకు మించి ఫలితం వస్తుంది అనిపిస్తుంది. పనిలో భాగస్వామి అయినవాళ్ళకి తాము చేసిన పని మీద అంచనా వేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. లేదా టెన్షన్ పెరుగుతుంది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తీరే వేరు. ఆయన కాన్ఫిడెన్స్ వేరు. నంద్యాల ఉప ఎన్నికల పర్వాన్ని టీడీపీ తరపున పర్యవేక్షించిన వారిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఏదో ఒకటిరెండు సందర్భాల్లో మినహా ఆయన నంద్యాల విడిచిపెట్టి రాలేదు. ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఆ బాధ్యతని సోమిరెడ్డి భుజాల మీద పెట్టాడు.
ఆ బాధ్యత నెరవేర్చడానికి శాయశక్తులా కృషి చేసిన సోమిరెడ్డి నంద్యాల ఫలితం మీద ధీమాగా వున్నారు. అందుకేనేమో నంద్యాల ఎన్నిక చంద్రబాబు పాలన మీద రెఫరెండం కాదని కేంద్రమంత్రి సుజనా చౌదరి లాంటి వాళ్ళు అంటున్నా సోమిరెడ్డి లెక్కచేయడం లేదు. నంద్యాల ఉపఎన్నిక రెఫరెండం అనుకున్నా ఫర్లేదు అన్నట్టు 25 వేల మెజారిటీతో గెలుస్తామని డంకా బజాయించి మరీ చెబుతున్నారు సోమిరెడ్డి. ఫలితం మాటెలా వున్నా చేసిన పనిమీద సోమిరెడ్డి కి వున్న నమ్మకాన్ని మెచ్చుకోవాల్సిందే.
మరిన్ని వార్తలు: