Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ముందుగా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగిన టీడీపీ చివరకు ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుంది. అప్పటి నుండి అటు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఆంధ్రాలో నేతలు ఆంధ్రాప్రదేశ్ విషయంలో మోదీ ప్రభుత్వ తీరు మీద రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో ఏపీని బీజేపీ మోసం చేసిందన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలు ఎన్ని చెబుతున్నా ప్రజలు విశ్వసించడం లేదు. ఈ నేపథ్యంలోనే మాజీ రాష్ట్ర అధ్యక్ష్యుడు హరిబాబుతో అధ్యక్ష పదవికి రాజీనామా చేయించారు. కొన్ని సామాజిక సమీకరణాల దృష్ట్యా హరిబాబు స్థానంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని బీజేపీ అధిష్టానం యోచించింది.
దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలలో ఎవరినో ఒకరిని అధ్యక్షుడిగా నియమించాలని అధిష్టానం భావించింది. అయితే వీరిలో సోము వీర్రాజుకే పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ అనగానే అంతెత్తున లేచి విరుచుకుపడే నైజం కేవలం సోము వీర్రాజుకే ఉంది. అదీ కాక అధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచిన కన్నా లక్ష్మీనారాయణకు వలస నేత అనే అడ్డంకి ఉంది, అలాగే మాణిక్యాలరావు పార్టీని బలోపేతం చేసేందుకు తన వద్ద తగిన నిధులు లేవని చెప్పడంతో ఆయన నియామకం కూడా అటక ఎక్కింది. అయితే ఆకుల సత్యనారాయణ ఉన్నా రాష్ట్ర అధ్యక్ష్యుడిగా పనిచేసేందుకు ఆయన అనుభవం సరిపోదని భావిస్తున్నారు.
అయితే వలస నేత అనే అడ్డంకి ఉన్నా కన్నాకి మాజీ మంత్రిగా రాష్ట్రమంతా అవగాహన ఉండడం, ఆర్థిక ఇబ్బందులు కూడా లేకపోవడం అనే అంశాలు పార్టీకి కలిసి వస్తాయని బీజేపీ నేతలు భావించారు. అయితే విషయం తెలుసుకున్న వీర్రాజు అలకపూనారు. పార్టీ కోసం తాను ఏళ్ల తరబడి పనిచేస్తున్నట్టు చెబుతూ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అధ్యక్ష పదవి అప్పగిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన పార్టీ పెద్దలు చివరికి వీర్రాజుకే పట్టం కట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది.