Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. చివరకు ఒకే ఫలితం మీద ఒకే పార్టీ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యే సందర్భాలు కూడా వస్తాయి. ఈ వ్యవహారం ఒక్కో సారి శృతి మించుతుంది కూడా. గుజరాత్ లో మోడీ పుణ్యమాని ఆరోసారి కూడా బీజేపీ విజయం సాధించింది. ఆ గెలుపు కోసం ఆయన పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరకు జెంటిల్ మ్యాన్ అనుకునే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని పాక్ తో కలిసిపోయారని విమర్శలు చేశారు. దీంతో గుజరాత్ లో గెలుపు అయితే దక్కింది కానీ దాన్ని సెలెబ్రేట్ చేసుకునే పరిస్థితి లేదు. తాము వేసుకున్న లెక్కల్లో ఏ కాస్త తేడా వచ్చినా సీన్ మొత్తం మారిపోయేదని ప్రధాని మోడీ , బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కి బాగా అర్ధం అయిపోయింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ని జనం తిరస్కరించిన వైనం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలుండగా వచ్చిన ఈ ఫలితాలతో ప్రధాని మోడీ, అమిత్ షా ఎలాగా అని కిందామీదా పడుతున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు మాత్రం గుజరాత్ ఫలితాలు చూసి కాలర్ ఎగరేస్తున్నారు. కనీసం గుజరాత్ ఫలితాల సంబరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఏ బీజేపీ మంత్రి ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వెనుక పట్టుమని పాతిక మంది కూడా లేరు. తెచ్చిన కేజీ స్వీట్ ప్యాకెట్ ఖాళీ అయ్యింది అంతకన్నా లేదు. కానీ ఏపీలో ఈసారి అధికారం మాదే అని బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తుంటే ప్రత్యర్ధులు, ప్రజలే కాదు ఆ నేతల పక్కన వుండే అనుచరులు సైతం నవ్వుకుంటున్నారు. ఇక సోము వీర్రాజు లాంటి వాళ్ళు అయితే దమ్ముంటే పొత్తు అక్కర్లేదని టీడీపీ ని చెప్పమని సవాల్ విసురుతున్నారు. ఆయన ఏ హోదాలో ఈ మాట అంటున్నారో కానీ ఆయన మాట కనీసం ఇక్కడ పత్రికలు అచ్చు వేస్తాయి. టీవీ చానెల్స్ చూపిస్తాయి. ఇక ఆయన పార్టీ తరపున నిర్ణయం తీసుకోవాల్సిన బీజేపీ పెద్దలు వుండే ఢిల్లీలో సోము మాటలు పట్టించుకునే దిక్కు లేదు. ఆ మాత్రం పలుకుబడి అయ్యగారికి ఉంటే ఎప్పుడో బీజేపీ, టీడీపీ కి విడాకులు అయ్యేవి. అయినా మబ్బులకు తగినట్టు వాన కురవలేదని గుజరాత్ గురించి బీజేపీ పెద్దలు ఫీల్ అవుతుంటే, అక్కడి మబ్బులు ఉన్నాయని మీడియాలో తెలుసుకుని ఇక్కడ వర్షం కురుస్తుందని నీళ్లు పారబోస్తున్న సోము లాంటి వాళ్లకి రాబోయే పరిణామాలే సరైన సమాధానం ఇస్తాయి. అప్పుడు గొంతు ఎండుతున్నా పట్టించుకునే నాధుడు లేని రోజున మ్యాటర్ అర్ధం అవుతుంది.