Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మోడీ, అమిత్ షా లకు తామే దైవాంశ సంభూతులమని అతిగా ఊహించుకోవడం అలవాటైందనడానికి… రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికే ప్రత్యక్ష నిదర్శనం. అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాలనే కాదు మిత్రపక్షాలని కూడా సంప్రదించలేదు. నా మాట వినక చస్తారా అన్నట్లుగా నిర్ణయం తీసుకున్నాక… మాట మాత్రంగా ఫోన్ చేశారంతే. ఇప్పుడు ఆ విషయమే సోనియాకు కోపం తెప్పిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంతో ఫోన్లో కూడా టచ్ లోకి రాకుండా… వారేదో బాసుల్లా ఆర్డర్ వేస్తే… మనం పాటించాలా అని ఆమె రగిలిపోతున్నారు.
అసలు దళితులు మొదట్నుంచీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్. ఆ ఓటు బ్యాంక్ ను చెల్లాచెదురు చేయడానికే దళితుడ్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే పంటిని పన్నుతోనే పీకాలని, దళితుడికి పోటిగా దళిత మహిళను నిలబెట్టాలని భావిస్తున్నారట. అదే జరిగితే మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ పేరు తెరపైకి రావడం ఖాయం. సీతారాం ఏచూరి కడా రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవం అవ్వాలన్న రూలేమీ లేదని హింట్ ఇచ్చారు.
మాయావతి కూడా మెరుగైన దళిత అభ్యర్థి లేకపోతేనే కోవింద్ కు మద్దతు అని షరతు పెట్టారు. మరి మీరాకుమార్ తెరపైకి వస్తే కచ్చితంగా యూపీయేకు ప్లస్సే. పైగా మీరాకుమార్ బీహార్ కు చెందిన వ్యక్తి. కాబట్టి నితీష్ కూడా అటే వెళ్లొచ్చు. ఎస్పీ, తృణమూల్, ఆప్, బీజేడీ కూడా పునరాలోచనలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి చూద్దాం సోనియా రాజకీయం ఎంతమేరకు చేయగలరో..