Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విమర్శలు, ప్రతివిమర్శలకు దూరంగా ఉండే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ… ఇండియాటుడే కాన్ క్లేవ్ 2018లో మాత్రం కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం దేశం తిరోగమనపథంలో సాగుతోందని సోనియా మండిపడ్డారు. మోడీ హయంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, తమ నోరు నొక్కేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదని, పార్లమెంట్ మూసేస్తే తామంతా ఇళ్లకు వెళ్లిపోతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి హయాంలో మాదిరిగా పార్లమెంట్ కార్యకలాపాలు గౌరవప్రదంగా ఉండడంలేదని విమర్శించారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని, భయం, బెదిరింపులు, మత ఘర్షణలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపీ హయాంలో ఆర్థికాబివృద్ధి గణనీయంగా ఉందని చెబుతున్నారని, 2014 మే 26కు ముందు దేశం ఏమన్నా అగాధంలోకి కూరుకుపోయిఉందా… అని ఆమె ప్రశ్నించారు.
నాలుగేళ్లలో భారత్ అభివృద్ధి, గొప్పదనం సాధించిందని చెప్పుకోవడం భారత ప్రజల మేధస్సుకు అవమానకరమని సోనియా అభ్యంతరం వ్యక్తంచేశారు . న్యాయవ్యవస్థ సంక్షోభంలో ఉందని, ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను, చర్చలను అంగీకరించాలని, ఏకపాత్రాభినయాన్ని కాదని సోనియా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలోపేతంపైనా సోనియా స్పందించారు. ప్రజలతో అనుసంధానమయ్యేందుకు కొత్త పద్ధతి ఎంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని తెలిపారు. కేంద్రంలో తిరిగి అధికారం సాధించేందుకు తమ హయాంలోని పాలసీలను, ప్రాజెక్టులను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దృష్టిపెట్టామని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన రాహుల్ గాంధీ ప్రజల మద్దతు కూడగట్టుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మన్మోహన్ తనకంటే మంచి ప్రధాని అవుతారని తనకు తెలుసన్నారు. రాజకీయాల్లో తన పరిమితులేమిటనేదానిపై తనకు అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయాలా వద్దా అనే అంశాన్ని పార్టీ నిర్ణయిస్తుందని సోనియా చెప్పారు.
ఇండియా టుడే కాన్ క్లేవ్ లో వ్యక్తిగత విషయాలనూ సోనియా చర్చించారు. రాజకీయాల్ల ప్రజాసేవ మాత్రమే మొదటి ప్రాధాన్య అంశమని, మిగతావన్నీ ఆ తరువాతేనని ఆమె అన్నారు. తన అత్త ఇందిరాగాంధీ హత్యానంతరం తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం అనివార్యమైందని, అయితే ఆయన కూడా కుటుంబానికి దూరమవుతారని తాను ఆందోళన చెందానని సోనియా తెలిపారు. అందుకే రాజీవ్ ను రాజకీయాల్లోకి వెళ్లొద్దని తాను కోరానని, అలా అనడం తన స్వార్థమే అని సోనియా గుర్తుచేసుకున్నారు. రాజీవ్ ను హత్యచేస్తారనే భయం తమలో ఉండేదని, చివరికి భయపడినట్టే జరిగిందని సోనియా కన్నీరు పెట్టుకున్నారు.