Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీడీపీ మీద కాసిన్ని పొగడ్తలు, కాంగ్రెస్ మీద విమర్శలు చేసి పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పోరాటాన్ని తెలివిగా పక్కదారి పట్టించాలనుకున్న ప్రధాని మోడీ పప్పులు ఉడకలేదు. మోడీ ప్రసంగం తర్వాత కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని ఓ రేంజ్ లో కడిగిపారేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మాటలతో సమస్య చల్లారిపోతుందని బీజేపీ భావించింది. కానీ టీడీపీ పోరాటంలో ఏ మార్పు లేదు. ఈ రోజు కూడా పార్లమెంట్ ఉభయసభల్లో విభజన హామీలు అమలు చేయాలన్న డిమాండ్ తో నిరసనకు దిగారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాల్ని అడ్డుకున్నారు. వెల్ లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో గందరగోళ పరిస్థితులు మధ్య ఉభయసభలు వాయిదాపడ్డాయి.
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇంకో అడుగు ముందుకెళ్లి సెక్రటరీ జనరల్ టేబుల్ మీదున్న పుస్తకాల్ని లాక్కోడానికి ప్రయత్నం చేశారు. అక్కడి సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. ఇక లోక్ సభలో టీడీపీ ఎంపీల వీరావేశం చూసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశ్చర్యపోయారు. ఆమె దేశం ఎంపీ కేశినేని నానిని పిలిచి ఆంధ్రాలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. విభజన హామీల అమలు చేయకపోవడం మీద ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నట్టు నాని తో పాటు దేశం ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు ఆమెకు వివరించారు. సోనియా తో దేశం ఎంపీలు మాట్లాడ్డం చూసిన బీజేపీ ఎంపీల మొహాలు మాడిపోయాయి. వరసగా నాలుగో రోజు లోక్ సభలో టీడీపీ పోరాటం, సోనియా తో మంతనాలు చూస్తుంటే భవిష్యత్ రాజకీయ పరిణామాలు వేగంగా మారేలా కనిపిస్తున్నాయి.