గత కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మీద కోడి కత్తితో ఒక వ్యక్తి హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి ఒక సీనియర్ సిటిజన్ లేవనెత్తిన ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. వారి ఫేస్ బుక్ టపా యదాతధంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి పై జరిగినట్లు చెపుతున్న ‘హత్యాయత్నం’ లో ఎన్నో చీకటి కోణాలు, మరెన్నో శేష ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. చిన్నదే అయినా ఆ కత్తిని అసలు ఏర్ పోర్ట్ లోపలికి ఎవరు, ఎలా అనుమతించారన్నది మొదటి ప్రశ్న. కేంద్ర పారిశ్రామిక భద్రతా బలం ( సి ఐ యస్ యఫ్) వారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇది ఎలా సాధ్యపడింది ? మరి ఇది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సి ఐ యస్ ఎఫ్, కేంద్ర పౌరవిమానయాన శాఖల వైఫల్యం కిందికి రాదా ? కాబట్టి కేంద్రప్రభుత్వమే దీని విషయమై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలా ? అక్కరలేదా ? మరి ఎందుకు ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక విస్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు ? భాజపా నేతలు తమకు తోచినట్లు మాట్లాడితే అదే కేంద్ర ప్రభుత్వ స్పందనగా మనం ఎలా భావిస్తాం ? హత్యకు ప్రయత్నించిన వ్యక్తి ఏ మాత్రం ప్రాణహాని చేయని ఒక చిన్న కోడి కత్తిని ఎంచుకోవడం, అదికూడా ప్రమాదకరం కాని రీతిలో భుజం కండరంపై గాయం చేయడం కూడా అనుమానానికి తావిస్తున్నాయి.
ఆ చిన్న కోడికత్తిని ఘటన జరిగాక గంటన్నర తరువాత స్వాధీన పరచుకున్నారంటే అప్పటిదాకా అది ఎవరి దగ్గర ఉంది ? టీవీలలో అందరికీ చూపిన ఆ కత్తిపై ఎలాంటి నెత్తురు మరకలు లేవు. మరి దానిపై ఉండాల్సిన రక్తపు మరకలను ఎవరు కడిగి శుభ్రపరిచారు ? దానిపై విషం పూశారేమో అనే అనుమానం వచ్చి దానిని ఫోరెన్సిక్ లాబ్ కి పరీక్షకు తామే పంపామని కొందరు వైకాపా నేతలు చెప్పడం ఏమిటి ? అది నిజమే కనుక అయితే నేరనిరూపణకు ఆధారమైన సాక్ష్యాలను మాఫీ చేసే ప్రయత్నం చేసినందుకు వారు కూడా శిక్షార్హులు అవుతారు కదా ? కొందరు వైకాపా నేతలు ఆ కత్తికి విషం పూశారనీ, ఇంకొందరు విషం పూయలేదు కాబట్టి సరిపోయింది. పూసివుంటే మా నాయకుడు ఏమయ్యేవారు ? అనీ అంటూ భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నిజంగా తమనేతపై హత్యాయత్నం జరిగిందనే భ్రమ కల్పించి ఆయన అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఆడుతున్న డ్రామాలే ఇవన్నీనని ఎవరికైనా అనిపించడం సహజం కదా ? మొదట్లో ఆ కత్తికి విషం పూశారని చెప్పిన వైకాపా మహిళా నేతకు అసలు ఆ సంగతి ఎలా తెలుసు ? ఇది అభిమానులలో భావోద్వేగాలు రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించే చెడు ఉద్దేశంతోనే చేసి ఉంటారని సామాన్యులు భావించే అవకాశం ఉందనేది వాస్తవమా ? కాదా ? ఆ కత్తికి విషం ఉందేమో అనే అనుమానం వైకాపా నేతలకు కనుక నిజంగా ఉండి ఉంటే వారు తమ నేతను హైదరాబాద్ వెళ్లకుండా నిరోధించి ఉండాల్సింది కదా ? విషహరణం చేసేందుకు మెరుగైన తక్షణ చికిత్స సదుపాయం చాలినంతగా విశాఖలోనే ఉంది కదా ? నిజంగా అది విషపూరితం అయివుంటే పరిస్థితి ఏమిటి ? అది విషయుక్తం కాదని ఆయనకి తెలుసు కనుకనే ఆయన తనకు ఏమీ జరగనట్టు ఎక్కడా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా నవ్వుతూ ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్ వెళ్లిపోయారంటున్నారు కొందరు. టివి లలోనూ అవే దృశ్యాలు కనిపించాయి. ఇంకొందరు తమ నేత విషప్రయోగాన్ని కూడా తట్టుకుని జయించిన వజ్రకాయుడు అని ప్రచారం చేసుకోటానికే ఇదంతా చేశారని విమర్శిస్తున్నారు. ఏమీ జరగనట్టు నవ్వుతూ విమానం ఎక్కివెళ్లిపోయిన ఆ నేత హైదరాబాద్ వెళ్ళాక తాపీగా ఆలోచించుకుని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేరి, స్పృహలో లేకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్సపొందుతున్నట్లు టీవీలలో వస్తున్న దృశ్యాలు చూస్తున్నవారి స్పందన ఎలావుంటుంది ? గాయానికి ప్రథమచికిత్స చేసిన విమానాశ్రయ వైద్యురాలు గాయం అర సెంటీమీటరు పొడవు, అరసెంటీమీటరు లోతు ఉందనీ, దానిని శుభ్రపరచి ఆయింటుమెంట్ రాసి డ్రెస్సింగ్ చేసి పంపడం జరిగిందనీ తన రిపోర్ట్ లో స్పష్టంగా రాశారు. మరి హైదరాబాద్ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్ చెప్పే దానిని బట్టి గాయం అక్కడికి వెళ్లేసరికి అంత పెద్దది ఎలా అయింది ? అర సెంటీమీటరు గాయానికి అన్ని కుట్లు వేయడం ఎందుకు అవసరం అయింది ? ఇవన్నీ సామాన్యుడి మదిని తొలిచే ప్రశ్నలు. అసలు అధికారులు ఒక గాయపడిన వ్యక్తిని విమానంలో వెళ్ళడానికి ఎలా అనుమతించారనేది మరో ప్రశ్న. ఒకవేళ రక్తస్రావం ఆగక హైదరాబాద్ చేరేలోపుగా బాధితుడికి ప్రాణాపాయం సంభవిస్తే ? ఈ నిర్లక్ష్య ధోరణికి మనం కేంద్ర పౌర విమానయాన శాఖను, కేంద్ర ప్రభుత్వాన్ని కాక వేరే ఎవరిని తప్పు పట్టాలి ? ఈ విస్పష్ట వైఫల్యానికి కేంద్రప్రభుత్వం తరఫున ప్రజలకు ఎవరు సంజాయిషీ ఇస్తారు ? మరో విషయం.
ఈ దుర్ఘటనలో ఆయన చొక్కా కూడా చిరగలేదని కొందరు అంటున్నది నిజమేనా ? హైదరాబాద్ వెళ్లిన తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను నమ్మను, వారు జరిపే విచారణకు నేను సహకరించను అని స్పష్టంగా చెప్పడం విడ్డూరమని ఎవరికైనా అనిపిస్తుందా ? అనిపించదా ? ఈ స్థితిలో ఆయన రక్తం మరక అయిన తన చొక్కాను విచారణాధికారులకు ఇచ్చి సక్రమమైన విచారణకు ఏమేరకు సహకరిస్తారన్నదీ అనుమానమే కదా ? ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు విశ్వాసం లేదు, తెలంగాణ పోలీసులు లేక ఏ రాష్ట్ర లేక కేంద్ర ప్రభుత్వ అధికారులు విచారణ జరిపినా సహకరిస్తాను అంటున్నారు మన ప్రతిపక్షనేత. ఇదంతా నేను రాష్ట్రంలో ఉంటే నా ప్రాణాలకు భద్రతలేదు అనే తప్పుడు ప్రచారం చేసుకుని సానుభూతి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడడమేనని ఎవరైనా భావించడం తప్పు ఎలా అవుతుంది ? ఇన్నాళ్లూ మూడువేల కిలోమీటర్లు తాను చేసిన పాదయాత్ర పొడవునా ఆయనకు రక్షణ కవచంగా నిలిచిన ఏ పి పోలీసులపైనే తనకు నమ్మకం లేదనడం విడ్డూరమని ఎవరైనా భావిస్తే అందులో తప్పేముంది ? మరి తన మిగిలిన పాదయాత్రను కొనసాగించడానికి తనకు రక్షణగా ఏ పోలీసులను ఆయన తెచ్ఛుకుంటారని కొందరు ముందుగానే ప్రశ్నించడం సహజమేకదా ? ఇంతకాలంగా తాను కలలు కంటున్న ముఖ్యమంత్రి పీఠాన్ని తాను రేపు అధిరోహించాలన్నా ఎన్నికలలో ఇదే పోలీసు వ్యవస్థ పటిష్టంగా, నిస్పాక్షికంగా పనిచేయాల్సి ఉంది కదా ? ఆ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారిపైనే నమ్మకం లేదని ప్రకటించడం ఆయనకు ఆత్మహత్యా సదృశం కాదా ? గొప్ప సలహాదారుల్ని పెట్టుకున్న జగన్ ఇంత అవివేకమైన ప్రకటనలు ఇవ్వడం ఏమిటని, ఇది నమ్మశక్యం కాదని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. నిజమే ఆయన అవివేకి కాదు. అమాయకుడూ అంతకంటే కాదు. సలహాదారులూ ఆయనకు సలహాలు బాగానే ఇస్తున్నారు. అయితే ఈ విషయంలో వారి ప్లాన్ బెడిసికొట్టి తుస్సుమన్న తూటా (Damp Squib ) అయింది. దాడి చేసిన వ్యక్తి వెల్లడిస్తున్న నిజాలు, లభిస్తున్న సాక్ష్యాల కారణంగా ఈ పథకం విఫలమై వారిపైకే బూమరాంగ్ ( Boomerang) అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి బయటికొచ్చిన వివరాలు చూస్తే దాడి చేసిన వ్యక్తి, అతని కుటుంబం జగన్ కి వీరాభిమానులని తెలుస్తున్నది. 2019 ఎన్నికలలో జగన్ కి లబ్ది చేకూర్చే ఉద్దేశంతోనే ఆయనకు సానుభూతి వస్తుందని తాను ఈ హత్యాయత్నానికి పాల్పడినట్లు అతడు విచారణాధికారులముందు వాంగ్మూలం ఇచ్చాడు. విచారణ పూర్తయితేనే ఈ విషయంలో పూర్తి నిజానిజాలు లోకానికి వెల్లడౌతాయి. అది అలా ఉంచి ఈ ప్రణాళిక వెనుక అసలు విషయం ఏమై ఉంటుందనే సందేహం బుద్ధిజీవులు ఎవరికైనా వస్తుంది. ఈ ఒక్క ఘటనని ఆధారంచేసుకుని ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రాణాలకే భద్రత లేదు. ఇక్కడ శాంతిభద్రతలను పరిరక్షించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా విఫలం అయిందని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికలలోపే రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించి ఎన్నికలకు వెళ్లాలనే దురాలోచన భాజపా నేతల ప్రకటనలలో స్పష్టంగా కనపడుతున్నది. ఇటీవల వారు ఏదీ మనసులో దాచుకోవడంలేదు మరి. నేడో రేపో ఈ ప్రభుత్వం రద్దయిపోతుంది. ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తాం. కేంద్ర ఏజెన్సీలు దాడులు చేసి కొందరు ముఖ్యనేతలను అరెస్ట్ చేస్తాయి అంటూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థల ప్రణాళికలను సైతం ముందస్తుగానే భాజపా నేతలు బయటపెడుతూ ఉండడం తమతో రాజకీయంగా విభేదించే వ్యక్తులను భాజపా నేతలు ఎంతగా బెదిరిస్తున్నారనేదానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నిస్పాక్షిక విధినిర్వహణకు పేరొందిన ఏ.పి. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగరనీ, తమ కర్తవ్యాన్ని తాము పక్కాగా నిర్వర్తిస్తారని, ఎన్నికలలో పార్టీల జయాపజయాలు ఆ యా పార్టీలకున్న ప్రజాభిమానం మీదనే ఆధారపడి ఉంటాయనీ గత చరిత్ర పలుమార్లు నిరూపించింది. అది అలా ఉంచి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మరింత పురోగతి చూపించి ఎన్నికలకు వెళ్లాలని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎన్నికలలోపు మరింత వేగవంతచేసి తన ప్రజాదరణను, తనపై ప్రజలకుగల విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనగా ఉంది. ఆయనకున్న ఈ ఆకాంక్షకు అడ్డుకట్టవేయాలని యత్నిస్తున్న భాజపా, వారి మిత్రబృందంలోని జగన్, పవన్ లు గవర్నర్ సహకారంతో ఆడుతున్న జగన్నాటకమే ఇదంతా అని సామాన్యుడు భావిస్తే అందులో తప్పేముంది ? ఇది కేంద్రప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగా జరిగిన ఘటన అని స్పష్టంగా తెలుస్తున్నా వారంతా ఒక్కుమ్మడిగా రాష్ట్రప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ విషయంలో ముద్దాయిగా నిలబెట్టాలని చూడడం దారుణం.
ఇక మన గవర్నర్ గారి విషయానికొద్దాం. నిత్యం అదే పనిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలను ప్రజల సొమ్ముతో సందర్శించుకుంటూ ‘మీరు దేవుడిని ఏమి కోరుకున్నార’ ని విలేకరులు ప్రశ్నిస్తే ఉభయ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనీ కోరుకున్నానంటూ బదులిచ్చే ఈ గవర్నర్ ప్రభుత్వ సక్రమనిర్వహణ కోసం, ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగ పరిధిలో నిర్వర్తిస్తున్న పాత్ర ఏమిటి ? ఇలా సుభిక్షంగా ఉండాలని ప్రార్థనచేసే పనిని ఒక ఆలయ అర్చకుడు కూడా చేయగలడు కదా ? గవర్నర్ వ్యవస్థ ఇందుకోసమే అయితే మనకు అసలు ఒక గవర్నర్ అవసరం ఉందా ? అని సామాన్యులు కూడా అనుకోవడంలో తప్పేముంది ? ఈయన పదవీకాలం ఈ డిసెంబర్ కి తొమ్మిది సంవత్సరాలు నిండి పదవ ఏట ప్రవేశించనుంది. మరొకరు ఆయన స్థానంలో నియమింపబడే వరకు ఆయన్నే నిరవధికంగా కొనసాగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఆయన సమర్థతే కారణమా ? లేక వేరే కారణాలు ఏమైనా కూడా ఉన్నాయా ? ఇంకా ఎన్నేళ్లు ఈయన్నే కొనసాగిస్తారు ? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఈ రెండు రాష్ర ప్రభుత్వాల రాజ్యాంగ అధినేతగా చేతనైతే రెండిటి మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి ప్రయత్నించాలి. చట్ట ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావలసిన నిధులకోసం తనవంతు కృషి తానూ చెయ్యాలి. కానీ అలాంటిదేమీ చేస్తున్నట్లు లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, కేంద్రం పరిష్కరించాల్సిన ఇతర సమస్యల పట్ల అసంతృప్తిగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాల్సిన గవర్నరుగారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం తరఫున కొందరు వ్యక్తులను, రాజకీయ నేతలను తన దగ్గరకు పిలిపించుకుంటూ వారికి రాజకీయ కర్తవ్య బోధ చేస్తున్నట్లు మీడియా గత చాలా కాలంగా ఘోషిస్తున్నది.
అది అలా ఉంచి ప్రజల సొమ్ముతో అధికారం చెలాయిస్తున్న గవర్నరు గారికి మొన్నటి తితలీ తుపానులో అతలాకుతలమై సర్వం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా బాధితులను పరామర్శించడానికి తీరికే లేకపోయిందా ? ఇంతవరకూ బాధితులపట్ల కనికరంతో తుపాను సహాయక నిధులనుంచి కనీసం తక్షణ సాయంగానైనా కొంత సొమ్ము రాల్చని ప్రధాని తుపాను తరువాత చంద్రబాబుకు ఫోన్ చేసి, అంతటితో చేతులు దులుపుకుంటే సరిపోయిందా ? రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధినేతగానూ, కేంద్రప్రభుత్వ ప్రతినిధిగానూ ఇక్కడ ఇన్నేళ్ళనుంచి కొనసాగుతున్న ఈ గవర్నరు గారికి కేంద్రం నుంచి తుపాను సహాయక నిధులు విడుదలచేయించే కనీస బాధ్యత ఉందా ? లేదా ? కనీసం వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్రం ఇవ్వాల్సిన సాయం, ఇటీవల ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం తిరిగి వెనక్కి తీసేసుకున్న రూ. 350 కోట్లు అయినా రాష్ట్రానికి ఇప్పించడానికి ఆయన చేసిన, చేస్తున్న కృషి ఏమిటని ప్రజలు ప్రశ్నించరా ? ఇటీవల ఆంధ్ర – ఒడిసా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఒక ప్రస్తుత శాసన సభ్యుడిని, మరో మాజీ శాసన సభ్యుడిని మావోయిస్టులు అమానుషంగా చంపితే కనీసం స్పందించని గవర్నర్ గారు రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్షనేతపై జరిగిన ఈ ‘ హత్యాయత్నం’ మీద మాత్రం వెంటనే స్పందించి రాష్ట్ర డిజిపి ని తనకు ఈ విషయమై ఒక నివేదిక పంపమనడంలో ఔచిత్యం ఏమిటి ? ఎదో ఒక నెపం చూపి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కూలదోయాలని కాచుకున్న భాజపా కుట్రలకు గవర్నరుగారు కూడా తమ వంతుగా సహకరిస్తున్నారని తెలుగు ప్రజలు అనుమానించడంలో తప్పేమైనా ఉన్నదంటారా ? విజ్ఞతతో ఆలోచిస్తే ఇది నిజమేననిపిస్తుంది ఎవరికైనా. దీనిని ముందుగా శంకించే చంద్రబాబు గవర్నర్ పదవిని ఎత్తేయాలని లోగడ సర్కారియా కమిషన్ చేసిన సూచనను ఇప్పుడు తెరపైకి తెచ్చి, దీనిపై ఒక దేశవ్యాప్త ఏకాభిప్రాయ సాధనకు కృషిచేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం పనిచేస్తున్న రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ కేవలం నామమాత్రపు అధిపతి(Titular Head ) గా మాత్రమే ఉండాలి. అలాంటి గవర్నర్ మంత్రివర్గాన్ని సంప్రదించకుండా ఏ అధికారాలతో డిజిపి ని నేరుగా రిపోర్ట్ కోరారని మండిపడుతూ గవర్నర్ల నిర్వాకంపై ఒక దేశవ్యాప్తమైన చర్చ జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఎన్నికల అనంతరం శాసనసభలో మెజారిటీ కలిగిన పార్టీ ఏదో స్పష్టత లేనప్పుడు మాత్రమే ఎవరైతే తన మెజారిటీ నిరూపించుకోగలరని తాను భావిస్తారో ఆ పార్టీ నేతను మంత్రివర్గం ఏర్పరచమని ఆహ్వానించే విచక్షణాధికారం మాత్రమే ఒక రాష్ట్ర గవర్నర్ కి ఉంటుంది. ఆ విచక్షణాధికారాన్ని కోర్టులు సైతం ప్రశ్నించడానికి వీలులేదు. ప్రజాస్వామ్యంలో సర్వసత్తాక శక్తి ప్రజలే కనుక రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తరువాత గవర్నర్ కు ఎలాంటి విచక్షణాధికారాలు ఉండవు. ఆయన ఏమి చెయ్యాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం సూచనల మేరకే చేయాల్సి ఉంటుంది. కనుక రాష్ట్రంలో ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉండగా గవర్నరే డిజిపి ని నేరుగా రిపోర్ట్ పంపమని అడగటం ఏరకంగా చూసినా రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. శాసన సభలలో ప్రసంగించేటప్పుడు కూడా గవర్నర్ లు మంత్రివర్గం తయారుచేసిన ఉపన్యాసాన్నే చదువుతారు. కొందరు గవర్నర్లు వారి వారి వ్యక్తిగత అభిరుచి మేరకు ‘అందరికీ నమస్కారం’ వంటి చిన్న చిన్న వాక్యాలను ప్రసంగానికి ముందు చేర్చి చదువుతారు తప్పితే, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని మాత్రమే వారు యథాతథంగా చదవాల్సి ఉంటుంది. గవర్నర్ పదవి భారత రాజ్యాంగం ప్రకారం ఎంత నామమాత్రపు అధికారాలు కలిగినట్టిదో గ్రహించడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. చూద్దాం. ఇందరు పాత్రధారులు ఆడుతున్న ఈ జగన్నాటకానికి ఎప్పటికి తెర పడుతుందో ?