శ్రీచైతన్య ర్యాంకుల సీక్రెట్ లీక్… అబ్బో, వాసు బాబు సస్పెండ్

Sri Chaitanya Dean Vasu Babu Suspend Over Telangana EAMCET 2 Leak case

తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో రెండేళ్ల దర్యాప్తు తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో 60 మంది నిందితులు ఇప్పటికే అరెస్ట్ అయినా రాని ప్రచారం ఒక్కసారిగా రావడానికి కారణం ఒకే ఒక్కటి. ఈ కేసులో శ్రీచైతన్య కాలేజీ డీన్ గా పని చేసిన ఓలేటి వాసు బాబు అరెస్ట్. ఆ కాలేజీ లో డీన్ బాధ్యతలతో పాటు ఆరు శాఖల ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఓలేటి వాసు బాబు తో పాటు ఆ కళాశాల తరపున ఏజెంట్ గా పని చేస్తున్న కమ్మ వెంకట శివనారాయణరావు ని కూడా cid అరెస్ట్ చేయడంతో డొంకంతా కదిలింది. ఇన్నాళ్లు పెద్ద పెద్ద ర్యాంకులు అంటూ ప్రచారాన్ని హోరెత్తించిన శ్రీచైతన్య డొల్లతనం బయటకు వచ్చింది. ఇంతకీ శ్రీచైతన్య పరువు బజారున పడేలా చేసిన ఈ కేసు పూర్వాపరాలు ఏంటంటే..

2016, జులై 9 న తెలంగాణ ఎంసెట్ 2 పరీక్ష ఫలితాలు వచ్చాయి. తొలిసారి ఎంసెట్ రాసినప్పుడు కొందరు విద్యార్థులు సాధించిన ర్యాంకులతో పోల్చుకుంటే రెండో సారి చాలా మంచి ర్యాంకులు వచ్చాయి. దీని వెనుక ఏదో జరిగిందన్న ఆంధ్రజ్యోతి కధనంతో అప్పటి ఎంసెట్ రమణారావు పోలీస్ విచారణకు ఆదేశించారు. ప్రాధమిక విచారణలోనే పేపర్ లీకేజ్ గురించి తేలడంతో సమగ్ర దర్యాప్తు కోసం కేసుని cid కి అప్పగించారు. దీంతో మొత్తం 50 కోట్లు ఈ స్కాం లో చేతులు మారినట్టు తేలింది. ఆ కేసులో తాజాగా శ్రీచైతన్య డీన్ ని అరెస్ట్ చేశారు.

ఈ విషయం బయటకు రాగానే ఆ సంస్థలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే వారికి ఎలాగోలా ఆ సంస్థ సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఈ స్కాం వల్ల ఎందరో టాలెంటెడ్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగింది. వారి భవిష్యత్ కి ఇలాంటి స్కాం లు చేటు తెలీకపోయినా ఆ లేత మనసులకి ఏ సందేశం ఇస్తాయి?. విలువలు నేర్పాల్సిన విద్యాసంస్థలు ఇలా వ్యవహరిస్తే ఇక పిల్లల భవిష్యత్ కి జవాబుదారీ ఎవరు ?. దైవం కన్నా గురువుకి అగ్ర పీఠం వేసే మన సమాజంలో ఇలాంటి విషయాలు తాత్కాలిక నష్టాలు చేసి ఆగిపోవు. యావత్ వ్యవస్థని దెబ్బ తీసే అనారోగ్యకర ధోరణులకు బీజం వేస్తాయి. అన్నిటి కన్నా దారుణం అయిన విషయం ఇంకోటుంది. ఈ వ్యవహారంలో అందరు చేతులు ఎత్తి చూపుతున్న శ్రీ చైతన్య ఓ బాధ్యతాయుత స్థానంలో ఉండి కనీసం క్షమాపణ అయినా చెబుతుంది అనుకుంటే అరెస్ట్ అయిన ఓలేటి వాసుబాబు ని సస్పెండ్ చేస్తూ ఫక్తు పొలిటికల్ స్టేట్ మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంది. అసలే దెబ్బ తిన్న గుండెల మీద ఇది కాలితో తన్నడమే. కాదంటారా ?