Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవి అతిలోకసుందరి, ఎంతో ప్రతిభ ఉన్న నటి మాత్రమే కాదు… ఆమెలో మరో టాలెంట్ కూడా ఉంది. అదే పెయింటింగ్. చిత్రలేఖనం అంటే ఆమెకు చిన్నప్పటినుంచి ఎంతో ఇష్టం. అయితే నాలుగేళ్ల వయసునుంచే సినిమాల్లో బిజీగా మారడంతో ఆమె తన హాబీకి సమయం కేటాయించలేకపోయింది. 1996లో బోనీని పెళ్లిచేసుకుని… ఇద్దరు పిల్లల తల్లిగా, గృహిణిగా స్థిరపడిన తర్వాత ఆమె తనకు ఎంతో ఇష్టమైన చిత్రలేఖనంపై మక్కువ తీర్చుకుంది. తన మనసులోని భావాలను కుంచెపై అందంగా తీర్చిదిద్దింది. అలా శ్రీదేవి ఈ 20 ఏళ్ల కాలంలో చాలా పెయింటింగ్సే వేసింది.
ఆమె పెయింటింగ్ లు నచ్చి 2010లో దుబాయ్ కు చెందిన అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ ఆమెను సంప్రదించింది. పెయింటింగ్ లను వేలానికి పెట్టాల్సిందిగా కోరింది. కానీ అందుకు శ్రీదేవి ఒప్పుకోలేదు. అయితే వేలంలో వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళంగా ఇస్తామని చెప్పడంతో… ఏదో ఒక సందర్భంలో తన పెయింటింగ్స్ ను ఆక్షన్ లో ఉంచారని ఆమె భావించింది. కానీ ఈలోపే ఆమె హఠాన్మరణం చెందింది. ఇప్పుడు శ్రీదేవి కోరుకున్నట్టుగా ఆమె పెయింటింగ్స్ ను వేలంలో ఉంచి… వచ్చిన డబ్బును ఛారిటీకి అందించేందుకు దుబాయ్ కే చెందిన అంతర్జాతీయ ఆర్ట్ హౌస్ సిద్దమయింది. శ్రీదేవి గీసిన పెయింటింగ్స్ అన్నింటిలో ఆమెకు బాగా నచ్చేది మైఖేల్ జాక్సన్ బొమ్మ. ఈ పెయింటింగ్ ను రూ. 8లక్షలను ప్రారంభధరగా నిర్ణయించి వేలానికి పెట్టనున్నారు. వాటితో పాటు సోనమ్ కపూర్ పెయింటింగ్ కూడా వేలంలో ఉంచుతున్నారు. సావరియా సినిమా విడుదలయిన సమయంలో ఆ మూవీలోని సోనమ్ ఫొటో ఒకటి శ్రీదేవికి బాగా నచ్చడంతో… ఆమె దాన్ని అందమైన పెయింటింగ్ మార్చారు. ఆ పెయింటింగ్ కూడా వేలంలో అమ్మకానికి ఉంచారు.