కేసీఆర్ రగిలించిన అభ్యర్ధుల జాబితా ప్రకటన అసమ్మతి అభ్యర్ధుల ప్రకోపానికి గురవుతూనే ఉంది. టిక్కెట్ ఆశించి భంగపడ్డవారు తమ అసంతృప్తి బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. తాజాగా తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేతకు హెచ్చరికలు జారీచేశారు. ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని శంకరమ్మ కేసీఆర్ ను హెచ్చరించారు. కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నా, మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో తనకు హుజూర్‌నగర్ టికెట్ కేటాయించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని హెచ్చరించారు.
గత ఎన్నికల్లో ఆమె హుజూర్‌నగర్ నుండి పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయారు. అయితే తాను 47 వేల ఓట్లు సాధించానని, ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని శంకరమ్మ తెలిపారు. హుజూర్‌నగర్ టికెట్ మాత్రమే తనకు కేటాయించాలని, అక్కడ తప్ప మరెక్కడ సీటు కేటాయించినా పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి ఉత్తమ్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉండగా టీఆర్ఎస్ అభ్యర్థిని కేసిఆర్ ఇంకా ప్రకటించలేదు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి సన్నిహితుడయిన ఒక ఎన్నారై పార్టీలో చేరి ఈ టికెట్ ఆశించి పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ నియోజగావర్గ టికెట్ ఎవరికీ దక్కనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
మొన్నటిదాకా టికెట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఓదేలు బెదిరించగా ఇప్పుడు ఈమె బెదిరిస్తున్నారు. వీరి బెదిరింపులతో కేసీఆర్ కు సూసైడ్ భయం పట్టుకుందని చెప్పక తప్పదు.