Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల్ టాంపరింగ్ తదనంతర పరిణామాలపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. బాల్ టాంపరింగ్ ఘటనలో ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్ జొహెన్స్ బర్గ్ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అనంతరం సిడ్నీలో తండ్రితో కలిసి మీడియాతో మాట్లాడాడు. బాల్ టాంపరింగ్ కు పూర్తి బాధ్యత తనదేనని, ఓ జట్టుకు కెప్టెన్ గా పూర్తిగా విఫలమయ్యానని చెప్పిన స్మిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తనను క్షమించాలని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని, తాను చాలా కోల్పోయానని బాధపడ్డాడు.
తాను ఎవరిపైనా నిందలు మోపాలని అనుకోవడం లేదని, జట్టుకు కెప్టెన్ గా అన్ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని, శనివారం ఆటలో జరిగిన ప్రతి దానికీ బాధ్యత తనదేనని స్మిత్ వ్యాఖ్యానించాడు. తనకు జరిగిన ఈ నష్టం వల్ల ఏదైనా లాభం ఉందంటే..అది ఇతరులకు ఈ ఉదంతం గుణపాఠం కావడమేనని, ఈ పరిణామం క్రీడా వ్యవస్థలో ఓ మార్పును తీసుకొస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని, క్రికెట్ ను ఎంతగానో ప్రేమిస్తున్నానని, క్రికెట్టే తన జీవితమని, దానిని తిరిగి తన జీవితంలో కొనసాగించాలని ఆశిస్తున్నానని, ఈ సమయంలో తాను గౌరవం, క్షమాగుణం తిరిగి పొందాలనుకుంటున్నానని వ్యాఖ్యానిస్తూ స్మిత్ కన్నీరు పెట్టుకున్నాడు. అంతకుముందు స్టీవ్ స్మిత్ కు దక్షిణాఫ్రికా లో ఘోర అవమానం ఎదురయింది. స్వదేశానికి వెళ్లేందుకు కేప్ టౌన్ ఎయిర్ పోర్టుకు వచ్చిన స్టీవ్ స్మిత్ ను చూసి ప్రయాణికులు చీట్, చీటర్, చీటింగ్ అంటూ హేళనగా మాట్లాడారు. స్మిత్ కు రక్షణగా వచ్చిన పోలీసులు సైతం స్మిత్ తో అవమానకరంగా ప్రవర్తించారు. ఏదో మొక్కుబడిగా స్మిత్ పక్కనఉండి దాదాపు నేరస్తున్ని లాక్కుని వెళ్లినట్టుగా తీసుకెళ్లారు. ఎస్కలేటర్ కూడా ఎక్కనీకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
అటు బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న మరో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా మౌనం వీడాడు. జొహెన్స్ బర్గ్ నుంచి సిడ్నీ వెళ్లే విమానంలో ట్విట్టర్ ద్వారా క్షమాపణలు కోరుతూ లేఖ రాశాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచంలోని అభిమానులారా…నేను ప్రస్తుతం సిడ్నీకి వెళ్లే దారిలో ఉన్నాను. నేను ఏదైతే చేశానో అది క్రికెట్ లో చాలా పెద్ద తప్పు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నాను. బాధ్యత కూడా వహిస్తున్నాను. నా ఈ చర్యకు అభిమానులు ఎంత బాధపడిఉంటారో అర్ధమయింది. చిన్ననాటినుంచి నేనెంతో ప్రేమించే క్రికెట్ కి ఇదో మచ్చ. నా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, నమ్మకస్తులతో ఈ ఏడాది సమయాన్ని గడుపుతాను. కొద్దిరోజుల్లో నానుంచి ఒక వార్త వింటారు అని వార్నర్ ట్వీట్ చేశాడు.