వ‌ర్మ‌ను తిర‌స్క‌రించిన రామోజీరావు

story-behind-ramoji-rao-rejecting-ram-gopal-varma-in-giving-direction-chance

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అగ్ర‌ద‌ర్శ‌కులుగా వెలుగొందుతున్న వారంతా ఒక‌ప్పుడు మొద‌టి అవ‌కాశం కోసం ప‌డ‌రాని పాట్లు ప‌డ్డ‌వారే. ఎవ‌రి ప్ర‌యాణ‌మైనా ఆ తొలి అవ‌కాశంతోనే మొద‌ల‌వుతుంది. కానీ ఆ ఛాన్స్ అందిపుచ్చుకోవ‌డానికే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల కోర్చాలి. ఆ క్ర‌మంలో అనుకున్న‌ది సాధించి…అగ్ర‌పథానికి వెళ్లినప్ప‌టికీ….ఆ తొలిరోజుల‌ను ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. ఆ స్థితికి రావడానికి చేసిన ప్ర‌య‌త్నాలు గుర్తొచ్చిన‌ప్పుడు ఓ ర‌క‌మైన భావోద్వేగం క‌లుగుతుంది. ఆ ఫీలింగ్ ను అంద‌రితో షేర్ చేసుకోవాల‌నిపిస్తుంది. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అలాంటి ఓ ఫీలింగ్ ను ఫేస్ బుక్ లో పంచుకున్నారు. మూడు ద‌శాబ్దాల క్రితం రామ్ గోపాల్ వ‌ర్మ త‌న‌కు ఒక్క అవ‌కాశం ఎవ‌రు ఇస్తారా అని ఎదురుచూసేవారు. అప్ప‌ట్లో ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి.

శ్రీవారికి ప్రేమ‌లేఖ‌, మ‌యూరి, ప్ర‌తిఘ‌ట‌న వంటి చిత్రాలు సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదుచేసుకున్నాయి. దీంతో రాంగోపాల్ వ‌ర్మ రామోజీరావును క‌లిసి ఓ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఇవ్వాల‌ని అడ‌గాల‌నుకున్నారు. రామోజీ రావు పెద్ద నిర్మాత‌, దిన‌ప‌త్రిక అధినేత‌.. మ‌రి రాంగోపాల్ వ‌ర్మ అనామ‌క వ్య‌క్తి. అలాంటి వ్య‌క్తి రామోజీరావును ఎలా క‌ల‌వ‌గ‌ల‌డు? అందుకే వ‌ర్మ ఓ ప్లాన్ వేశారు. రామోజీ సంస్థ‌ల‌కు చెందిన ఇంగ్లీష్ ప‌త్రిక న్యూస్ టైమ్ కు ది ఐడియా ద‌ట్ కిల్డ్ 50 మిలియ‌న్ పీపుల్ పేరుతో ఓ ఆర్టిక‌ల్ రాశారు. ఆ ఆర్టిక‌ల్ ద్వారా త‌న ఇంగ్లీష్ ప‌రిజ్ఞానం ప్ర‌ద‌ర్శిస్తే రామోజీరావు దృష్టిలో ప‌డ‌వ‌చ్చ‌ని వ‌ర్మ ఆలోచ‌న‌. అనుకున్న‌ట్టుగానే వ‌ర్మ రాసిన ఆర్టిక‌ల్ పేప‌ర్ లో ప్ర‌చురిత‌మైంది. వ‌ర్మ‌కు రామోజీరావును క‌లిసే అవ‌కాశ‌మొచ్చింది. త‌న‌ను తాను కాల‌మిస్టుగా చెప్పుకుంటూ రామోజీరావు వద్ద‌కు వెళ్లిన వ‌ర్మ ఆయ‌న‌తో భేటీ త‌ర్వాత త‌న మ‌నసులో మాట వెల్ల‌డించారు. కానీ వ‌ర్మ అభిప్రాయాల‌తో రామోజీరావు ఏకీభ‌వించ‌లేదు. ద‌ర్శ‌కుడికి ఇమాజినేష‌న్ ఉండాల‌ని, ఆయన కింద ప‌నిచేసే సాంకేతిక నిపుణుల‌కు అనుభ‌వం ఉంటే చాల‌ని వ‌ర్మ చేసిన వాదన‌ను రామోజీరావు తోసిపుచ్చారు. కావాలంటే త‌న పేప‌ర్ లో ఉద్యోగ‌మిస్తాన‌ని చెప్పారు. త‌ను అనుకున్న‌ది జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నిరాశ‌గా వెన‌క్కి వ‌చ్చారు వ‌ర్మ‌. ఈ విష‌యాన్ని ఫేస్ బుక్ లో వెల్ల‌డించారు వ‌ర్మ‌. ఇప్పుడా సంద‌ర్భం ఎందుకొచ్చిందంటే… న్యూస్ టైమ్ లో వ‌చ్చిన వ‌ర్మ ఆర్టిక‌ల్ క్లిప్ ఇప్ప‌టిదాకా ఆయ‌న ద‌గ్గ‌ర లేదు. ఇటీవ‌లే రాజా అనే ఆయ‌న స్నేహితుడు దాన్ని తెచ్చి ఇచ్చాడు. దీంతో వ‌ర్మ‌కు ఆనాటి సంగ‌తులు గుర్తుకొచ్చాయి. న్యూస్ టైమ్ పేప‌ర్ లో వ‌చ్చిన త‌న పేరు చూసి స్నేహితులు, బంధువులు థ్రిల్ ఫీల‌య్యార‌ని వ‌ర్మ ఆనాటి జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు.