ఎవరికి మంచి మార్కులు వస్తాయి ?. బాగా చదివే వారికి. ఎవరు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తారు? .. ప్రణాళికాబద్ధంగా చదివే వారికి. అబ్బా ఇలాంటి చచ్చు ప్రశ్నలు , రొటీన్ సమాధానాలు వినీవినీ బోర్ కొడుతోందా ?. అయితే తప్పకుండా మీరు ఈ కొత్త సమాధానం వినాల్సిందే. ఆ పరీక్షా కేంద్రంలో రాస్తే చాలు ర్యాంకులు వచ్చేస్తాయి. ఇదేమి చోద్యం అనుకుంటున్నారా… అక్కడే వుంది మతలబు అంతా. అదేంటో తెలుసుకోవాలంటే కాస్త డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే.
10 th క్లాస్ పూర్తి అయ్యి ఇంటర్ లో చేరే ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇచ్చి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమం NTSE పరీక్ష. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. పేరులోనే ఆ పరీక్ష ఉద్దేశం వుంది . మూడు దశల్లో జరిగే ఈ పరీక్ష తొలిదశ బాధ్యత రాష్ట్రాలకే. తొలిదశ పరీక్ష నిర్వహణ కోసం సెల్ఫ్ సెంటర్స్ కి అనుమతి దొరకడంతో చైతన్య విద్యాలయం రెచ్చిపోయింది. రెచ్చి పోయి ఏమి చేసిందనేగా మీ ప్రశ్న. కర్నూల్ లో ని ఓ ఎగ్జామ్ సెంటర్ లోనే 40 మంది విద్యార్థులకు NTSE తొలిదశ పరీక్షలో సెలెక్ట్ అయిపోయారు. ఈ ఫలితాలు చూసాక ఇంకా చైతన్య అది చేసింది, ఇది చేసింది అని చెప్పడం అవసరం లేదనుకుంటా.
అయితే ఎప్పటిలాగానే ఈ వ్యవహారం నాలుగు రోజుల్లో చప్పబడిపోతుంది అనుకున్నారు. కానీ చాన్నాళ్లుగా ఉద్యమాలకు దూరం గా ఉండిపోయాయేమో అనిపించిన విద్యార్థి సంఘాలు మరీ ఇంత ఘోరమా అంటూ రంగంలోకి దిగిపోయాయి. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో nsui తరపున విద్యార్థులు భారీ ఆందోళన నిర్వహించారు, NTSE పరీక్షల్లో శ్రీ చైతన్య అక్రమాల గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక pdsu ఆధ్వర్యంలో నంద్యాలలో కూడా ర్యాలీ నిర్వహించారు. ఇక కర్నూల్ లో జిల్లా కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేసిన విద్యార్థులు డిప్యూటీ కలెక్టర్ కి NTSE పరీక్షల్లో చైతన్య అక్రమాల మీద విచారణకు ఆదేశించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. విద్యార్థి సంఘాల వేడి చూస్తుంటే NTSE విషయంలో వాళ్ళు చైతన్యని అంత తేలిగ్గా వదిలేట్టు లేరు.